November 10, 2008

రోడ్డు మీద కోక్‌ టిన్నుని లాగి పెట్టి తన్నడంలో exhilaration

ఆనందంగా ఉండటం మనిషికి ఒక నైతిక బాధ్యత అట. నిన్న రాత్రి ఓ బోర్హెస్‌ వాక్యం చెప్పింది. కొన్ని వాక్యాలు ఊరికే లోపలికి వెళ్ళి ఊరుకోవు. వెళ్ళాక లోపల దేన్నో కదిపేసి కుదిపేసి పెద్ద కలకలం రేపేస్తాయి. ఆనందం మనిషి జీవిత పరమార్థమని, మన ప్రతీ చర్యలోనూ పైపై పూతల్ని తొలగించుకుంటూ పోతే లోపల కనిపించేది ఆనందం పట్ల కాంక్షే అనీ నాకు తెలుసు. కాని "ఆనందంగా ఉండటం, ఆనందాన్ని వెతుక్కోవటం మనిషి కనీస బాధ్యత'' అని నేనెవరి దగ్గరా ఇంతవరకూ వినలేదు. "ఆనందో బ్రహ్మ'' అంటూ మనవాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఎందుకనో అది ఓ ఆదర్శం అన్నట్టే వినిపించింది గానీ, అదో నైతిక బాధ్యత అన్నంత ఖచ్చితత్వం ధ్వనించలేదు. అందుకే అనుకుంటా ఆ వాక్యం అంతగా కొట్టొచ్చినట్టు కనిపించింది. వెంటనే పుస్తకం మూసి బయటకు వచ్చేశాను. బయట శీతాకాలం అర్థ రాత్రి చల్లగా ఆహ్వానం పలికింది. రూమ్‌ తలుపు దగ్గరకు జారేసి, వంటి చుట్టూ వెచ్చగా హత్తుకునేట్టు స్వెటర్‌ జిప్‌ పైకి లాక్కుని బయటకి నడిచాను. ఎందుకో ఆ వాక్యాన్ని వెంటనే వదిలేయాలనిపించలేదు. దాన్ని కరిగిపోనీకుండా పూర్తిగా నాలోకి జీర్ణం చేసుకోవాలనిపించింది. దాని గురించి కాసేపు ఆలోచించాలనిపించింది. నిరంతరాయమైన ఆలోచనకి అన్ని విధాల అనుకూలమైన పరిసరాలు వున్నాయి అప్పుడు నా చుట్టూ: హైదరాబాద్‌ అంతా నిద్రపోతున్న నిశ్శబ్దం, నిర్మానుష్యమైన రోడ్డు, జనావాసాల్లేకుండా అటూ ఇటూ రాళ్ళ గుట్టలు, నన్ను నాలోకి మరింత ఒదిగిపోయేలా చేస్తున్న చలి, ఆలోచనల విరామంలో పరాకుగా తలెత్తినప్పుడల్లా వీథి లైట్ల చాటు నుంచీ "నేను నీతోనే వస్తున్నానంటూ'' ఆత్మీయంగా పలకరిస్తున్న నిమ్మతొనంత చందమామ . . . ఇంకేం కావాలి. ఇంకా చెప్పాలంటే, అడపాదడపా రోడ్డు వారన లుంగ చుట్టుకు పడుకున్న కుక్కల నిద్రని నేను చెడగొడుతున్నానేమో గాని, నన్ను నా ఆలోచనల్నీ భంగపరచడానికి అక్కడే అడ్డంకులూ లేవు. వాహనాలు కూడా అప్పుడొకటి ఇప్పుడొకటి తప్ప రాకపోవడంతో రోడ్డు మధ్యనే నడుస్తున్నాను. కాళ్ళు, ఆలోచనలు నా ప్రమేయమేమీ లేకుండానే వాటి తోవన అవి సాగిపోతున్నాయి. ఆనందంగా ఉండటం మనిషి కనీస బాధ్యత అట. ఎందుకో ఇది తిరుగులేని స్టేట్‌మెంట్‌లా అనిపించింది. పైగా ఆ స్టేట్‌మెంట్‌ని ఇచ్చిన మనిషే దానికి తిరుగులేని సాక్ష్యంలా కనిపించాడు: Borges. చదవటం, రాయటం మాత్రమే తన జీవితమనుకున్న మనిషికి కళ్ళు పోతే ఎలా ఉంటుంది. పిచ్చెక్కి పోదూ. అయినా ప్రతీ చోటా నవ్వుతూనే కనిపిస్తాడు. రాతల్లో కూడా చాలా సరదా మనిషిలా స్ఫురిస్తాడు. అంధత్వం ఖాయమైపోయాకా పెద్ద పెద్దవి రాయడం మానేసాడట; చిన్న చిన్న కథలు, కవితలూ అయితే కలం కాగితాల సహాయం లేకుండానే మెదడులో నిలుపుకోవచ్చని అవి మొదలుపెట్టాడట. పేరాలకు పేరాలు, పంక్తులకు పంక్తులు మెదళ్ళో మోసుకుంటూ చేతి కర్ర సాయంతో బ్యునోస్‌ ఎయిర్స్‌ వీథుల్లో తిరిగేవాడట. మరీ మనిషి చెప్పాడంటే ఒప్పుకుని తీరాల్సిందే కదా. అయినా ఇది చాలా కనీస విషయం. ఆనందంగా ఉండక ఏడుస్తూ బతుకుతామా. అంతే, కొన్నిసార్లు అన్నీ తెలుసున్నా అంతా మర్చిపోతాం. లోపలే నిలవున్న దాని కోసం ఎక్కడెక్కడో వెతుకుతూంటాం. మన ఆనందమూ మన పెంపుడు కుక్క లాంటిదే. పాపం అది మన దృష్టిని ఆకర్షించాలని తోకూపుకుంటూ, కాళ్ళ సందుల్లోంచి అటూ ఇటూ జొరబడిపోతూ, వేళ్ళు నాకేస్తూ, నానా తంటాలు పడిపోతూంటుంది. మనం చేయాల్సిందల్లా దాని వైపు ఆహ్వాన సూచకంగా చేయి సాచటమే. కాస్త ధ్యాస దాని వైపు మళ్ళిస్తే చాలు, ముందరి కాళ్ళు రెండూ పైకెత్తి మన చుట్టూ అల్లుకుపోతుంది. ఒక్కసారి తల విదిలించుకో, "just snap out of it" అనుకో . . . అంతా ఆనందమే. అది తెలిసీ ఇన్ని రోజులు దిగాలుగా ఉన్నాను. కాని ఇప్పుడు నేను ఆనందంగా ఉండటానికి అడ్డేమిటి అని ప్రశ్నించుకుంటే, చిత్రంగా, ఒక్క సమాధానమూ తట్టడం లేదు.

బహుశా ఆ దిగులంతా ఇంకా ఏ దారో నిశ్చయించుకోలేకపోవడం వల్ల వచ్చిన దిగులేమో; రెండుగా చీలిపోయిన రోడ్డు ముందు నిలబడి, ఒక దారిలో పోతే మరోదారిలోని అందాలు కోల్పోతానేమో అని బాధ పడే వాడికి కలిగే దిగులు లాంటిదేమో. "సిటీ స్లికర్స్‌'' అని చాన్నాళ్ళ క్రితం చూసిన సినిమా గుర్తొస్తోంది. అందులో బిల్లీ క్రిస్టల్‌ న్యూయార్క్‌ నగరంలో, నచ్చని ఉద్యోగంలో, కలతల సంసారంతో యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అతని నలభయ్యో పుట్టిన రోజుకి బహుమతిగా అతని ఇద్దరి స్నేహితులూ ఒక విహార యాత్ర ప్లాన్‌ చేస్తారు. వాళ్ళిద్దరూ కూడా బిల్లీలాగే మిడ్‌లైఫ్‌ క్రైసిస్‌తో బాధపడుతూంటారు. ఆ యాత్ర ప్రకారం యాత్రికులందరూ కొన్నాళ్ళ పాటు కౌబాయ్స్‌లా ఆవులు మేపుతూ గడపాలి. (నాకు సరిగా గుర్తు లేదు; అంతే అనుకుంటా.) మొదట ముగ్గురూ ఇక్కడ కుదురుకోలేకపోతారు. కాని నెమ్మదిగా నెమ్మదిగా ఈ క్యూబికల్సూ, కాన్ఫరెన్సులూ లేని జీవితం వాళ్ళకు నచ్చటం మొదలౌతుంది. అక్కడ వీళ్ళకి ఒక ముసలి వాడైన కౌబాయ్‌ తారసపడతాడు. బిల్లీ క్రిస్టల్‌కి అతను బాగా నచ్చుతాడు. జీవితం పట్ల తనలో లేని నిబ్బరం అతనిలో చూస్తాడు. ఒక సన్నివేశంలో ఇద్దరూ కౌబాయ్‌ వేషాల్లో ప్రక్కన ప్రక్కన గుర్రాల మీద వెళ్తూంటారు. హఠాత్తుగా ఆ కౌబాయ్‌ బిల్లీ వైపు తిరిగి "నీకు జీవిత రహస్యం ఏంటో తెలుసా?'' అంటాడు.

బిల్లీ చాలా ఉద్విగ్నతతో "ఏమిటి!?'' అని అడుగుతాడు.

కౌబాయ్‌ నిశ్శబ్దంగా తన చూపుడు వేలు ఎత్తి చూపిస్తాడు.

బిల్లీ: (అర్థం కానట్టూ మొహం పెట్టి) ఏమిటి, నీ వేలా?

కౌబాయ్‌: ఒకే విషయం . . . కేవలం ఒకే విషయం . . . దానికి బద్దుడవై ఉండిపో. జీవితం సులభమైపోతుంది.

బిల్లీ: అది సరే . . . కాని ఆ ఒక్క విషయమూ ఏమిటి?

కౌబాయ్‌: అదేంటో నువ్వే తేల్చుకోవాలి.

-- మనదీ ఇంచుమించు ఇదే బాధ. ఇంకా ఆ ఒక్కటీ ఏమిటన్నది నిర్ధుష్టంగా తేలడంలేదు. ఒక వేళ తేలినా, ఆ దారినే గుడ్డిగా నమ్మేసి "ఇదే జీవితం'' అని నిశ్చింతగా వెళిపోగలమా. అలా వెళిపోయినా ఆ దారికి సమాంతరంగా లక్షా తొంభై మార్గాలు ఊరిస్తూంటే మళ్ళా ఏదో కోల్పోయామనిపించదా. కాని ఏదో ఒకటి పట్టుకోక తప్పదని మాత్రం తెలుసు. చార్లీ కఫ్‌మన్‌ 'అడాప్టేషన్‌' సినిమాలో ఓ పాత్ర అంటుంది:

"There are too many ideas and things and people. Too many directions to go. I was starting to think that the reason it matters to care so passionately about something is that it whittles the world down to a more manageable size."

--కాబట్టి ఏదో ఒక దాన్ని పట్టుకోకపోతే ఈ బృహత్‌ ప్రపంచం మన మతి పోగొట్టేస్తుంది. అయినా నిన్న మొన్నటి దాకా నాకో పట్టుగొమ్మ ఉందనే అనుకున్నాను. చాలా అందమైన పట్టుగొమ్మ అది. మానవ అస్తిత్వ సమస్యకు అదే ఒక్కగానొక్క పరిష్కారమని నాకు ఎరిక్‌ఫ్రామ్‌ చెప్పక ముందే తెలుసు. దాని పేరు ప్రేమ. ఎంత నిజమో కదా. జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలంటే ప్రేమించాలి. అంతే, మరో దారి లేదు. ఈ ప్రేమ అనేది లేకపోతే మనిషిగా ఈ భూమ్మీద మన ఉనికిని భరించడం చాలా కష్టమై ఉండేది. స్నేహితులో, ప్రేయసీ ప్రియులో, భార్య భర్తలో, తండ్రీ కొడుకులో, అన్నా చెల్లెళ్ళో, సాటి మనుషులో . . . ఇలా బంధాలేవైనా మనందరి మధ్య ఈ ప్రేమ అనే భావన లేకపోతే మానవ అస్తిత్వం భరించలేనంత దుర్భరమైపోయి ఉండేది. అసలు మనుషులకు ఇంత అర్థం లేని అస్తిత్వాన్ని అంటగట్టినందుకు నష్టపరిహారంగానే ఈ ప్రేమను ఇచ్చాడేమో దేవుడు. అయితే ఇక్కడో చిన్న ఇబ్బంది ఉంది. ఎరిక్‌ఫ్రామ్‌ ఈ ప్రేమను మనుషులకు మాత్రమే ఉద్దేశించమన్నాడో లేదో నాకు తెలియదు కానీ, మనుషులకు మాత్రమే ఉద్దేశిస్తే కొన్ని సమస్యలుంటాయి. మనుషులతో ప్రేమ షరతులతో కూడి ఉంటుంది. మనం మథర్‌ థెరిసాలం కాదు గనుక కొన్ని షరతులతో మాత్రమే అవతలి వారికి ప్రేమను ఇవ్వగలం. కొన్ని షరతులతో మాత్రమే అవతలి వారి నుండి ప్రేమను పొందగలం. అలాగాక బేషరతుగా ప్రేమ కావాలనుకుంటే మాత్రం ఈ వ్యవహారంలోంచి మనుషుల్ని పక్కన పెట్టేయక తప్పదు. అక్కడే నా పట్టుగొమ్మ విరిగిపోయింది. నాకు మరో ఆసరా కావాల్సి వచ్చింది. బహుశా ఆ ఒక్కటీ ఏమిటన్నది నా కిప్పుడిప్పుడే నిర్ధుష్టంగా స్పష్టమవుతుందేమో. ఏ షరతులూ లేని ప్రేమ, నా వరకూ, కళతోనే సాధ్యమవుతుంది. అది ఎంత ఇచ్చినా తీసుకుంటుంది; అంతకు అంత తిరిగి ఇస్తుంది. అది ప్రేమ మాత్రమే అడుగుతుంది. ప్రేమను మాత్రమే ఇస్తుంది.

ఇలా నా ఆలోచనల్ని ఫోర్త్‌ఫేజ్‌ నుండి సైబర్‌ టవర్స్‌ దాకా నడిపించాకా అర్థమైంది: మన ఆనందాలకు మనుషుల్ని ఆధారభూతాలుగా నిలుపుకోవడం ఎంత నిష్పలమో, దుఃఖదాయకమో, కొండొకచో ప్రమాదకరమో; నాలోనే ఉండి, నేను అనుమతి ఇస్తే చాలు నన్ను మొత్తంగా కమ్మేద్దామని ఎదురుచూస్తున్న ఆనందాన్ని కాదని బయట దేబిరించడం ఎంత వెర్రితనమో. చౌరస్తా దగ్గర కూడా పెద్దగా జనం లేరు. నియాన్‌ లైట్ల వెలుగులో సన్నగా మంచు కురవడం కనిపిస్తోంది. ఏమో అది మంచో, దుమ్ము కణాలో . . . ఇక్కడ దేన్నీ నమ్మలేం. ఓ మూల చాయ్‌ దుకాణం ఇంకా తెరిచే ఉంది. ఎందుకో అలవాటు లేకపోయినా తాగాలనిపించింది. అర్థం పర్థం లేకుండా ముప్పిరిగొంటున్న ఆనందాన్ని నాతో నేను సెలబ్రేట్‌ చేసుకోవాలనిపించింది. చాయ్‌ తాగి వెనక్కి నడిచాను. కొన్నిసార్లు, మనం అస్సలు సిద్ధంగా లేనపుడు, ఉధృతమైన ఆనందం చెప్పా పెట్టకుండా దాడి చేస్తుంది. మన ఉనికికి అతీతమైన ఆనందమది. ఆ ఆనందానికి మన శరీరం సరిపోదు. బద్దలైపోతామనిపిస్తుంది. వెన్నులోంచి మొదలై వళ్ళంతా జలదరించిపోతుంది. పిచ్చిగంతులేయాలనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఆ ఖాళీ రోడ్డు మీద నేను పరిగెత్తినా, పిచ్చి గంతులేస్తూ, పిచ్చి పాటలు పాడినా ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు. చందమామ మనోడే. అర్థం చేసుకున్నట్టు చల్లగా నవ్వుతున్నాడు.
.