April 17, 2009

మేపెల్ ఆకు గిరికీలు కొడ్తూ రాలడమో...


రాయడానికి అస్సలేమీ లేనపుడు, అయినా కాస్సేపు అక్షరాల సాంగత్యంలో గడపాలనిపించినపుడు, ఉత్తమమైన ఉపాయం అనువాదం. స్వతంత్ర రచనలో, మన భావాన్ని మన వాక్యాల్లో పట్టుకోగలిగినపుడు చాలా ఆనందం కలుగుతుంది; అనువాదంలో, వేరే వాళ్ళ భావాన్ని మన వాక్యాల్లో పట్టుకోవడంలో, అంత కాకపోయినా కొంత ఆనందం కలుగుతుంది. అలాగే మొదటి దాంతో పోలిస్తే సహజంగానే రెండో దాంట్లో అలసట, అయోమయం తక్కువ. అందీ అందక విసిగించే జింకల్లాంటి భావాల్ని పట్టుకోవడానికి మస్తిష్కారణ్యంలో పడి వాక్యాల వేటకుక్కల్ని వదలనక్కర్లేదు. మూలంలోని వాక్యాల రూపంలో చేయవలసిన పని ఫలానా అని ముందే ఓ దిశానిర్దేశం వుంటుంది.
అనువాదం అనగానే గుర్తొచ్చిన పేరా యిది. రెండ్రోజుల క్రితం చదివిన "ద పొటాటో ఎల్ఫ్" అనే కథలోనిది. రచయిత నబొకొవ్. ఇదే ఎందుకు గుర్తొచ్చింది? బహుశా నబొకొవ్ యిలాంటి పేరాలు అరుదుగా రాయడం వల్ల కావచ్చు. అరుదుగా రాయడం అంటే ఇంత అందమైన వచనం అరుదుగా రాయడమని కాదు. నబొకొవ్ వచనమంతా అందంగానే వుంటుంది. ఇందులో వున్న ప్రత్యేకత వేరు. నబొకొవ్ ఉత్తమపురుషలోనే కథనాన్ని నడిపినా, "నేను" అంటూ కథ చెప్పే పాత్రకి ఎప్పుడూ తన వ్యక్తిత్వం, తన అభిప్రాయాలు అరువివ్వడు; కథలో ఎప్పుడూ కలగజేసుకోడు. ఇక ప్రథమపురుష (third-person) కథనంలో అయితే సమస్యే లేదు; కనిపించనే కనిపించడు. నిశ్శబ్దంగా, గంభీరంగా వచనపు తెరవెనకే నక్కిపోయి వుంటాడు. "ఎందుకంత గంభీరత్వం, ఒక్కసారి కథలోకి వచ్చి ఒళ్ళు విరుచుకోవచ్చు కదా" అని ఒక్కోసారి విసుక్కోబుద్దేస్తుంది కూడా. ఈ పేరాలో అదే చేస్తున్నాడు. అందుకే అరుదైన పేరా అంటున్నాను. (అయితే ఈ ఒళ్ళు విరుచుకున్న సందర్భం కథ మొత్తం చదివినవాళ్ళకే అర్థమవుతుంది):

"Every seperate day in the year is a gift presented to only one man—the happiest one; all other people use his day, to enjoy the sunshine or berate the rain, never knowing, however, to whom that day really belongs; and its fortunate owner is pleased and amused by their ignorance. A person cannot foreknow which day exactly will fall to his lot, what trifle he will remember forever: the ripple of reflected sunlight on a wall bordering water or the revolving fall of a maple leaf; and it often happens that he recognizes his day only in retrospection, long after he has plucked, and crumpled, and chucked under his desk the calendar leaf with the forgotten figure."

"సంవత్సరంలో ప్రతీ ఒక్క రోజూ కేవలం ఒకే మనిషికి—అత్యంత ఆనందకరమైన మనిషికి—సమర్పితమైన బహుమతి; మిగతా జనమంతా అతని రోజుని, సూర్యకాంతిలో సుఖించడానికో లేక వర్షంలో విసుక్కోవడానికో, వాడుకుంటారు; ఆ రోజు నిజంగా ఎవరికి చెందిందో ఎప్పటికీ తెలుసుకోరు; అదృష్టవంతుడైన దాని యజమాని వాళ్ళ అమాయకత్వానికి ముచ్చటపడతాడు, వినోదిస్తాడు. ఏ రోజు తన ఖాతాలోకి జమ కాబోతోందో, ఏ అల్పవిషయాన్ని తాను శాశ్వతంగా గుర్తుంచుకోబోతున్నాడో ఏ వ్యక్తీ ముందే తెలుసుకోలేడు: నీటి చెలమ అంచునున్న గోడపై ప్రతిబింబించిన సూర్యకాంతి తరంగాలో లేక ఓ మేపెల్ ఆకు గిరికీలు కొడ్తూ రాలడమో. . . ; చాలాసార్లు అతను తన రోజేదో గుర్తించేది సింహావలోకనంలోనే; మర్చిపోయిన అంకెగల కేలండర్ కాగితాన్ని చింపి, నలిపి, మేజా కింద గిరవాటేసిన చాన్నాళ్ళ తర్వాతనే."

కథలో ముఖ్య పాత్ర సర్కస్‌లో ఒక మెజీషియన్ దగ్గర పనిచేసే మరుగుజ్జు. అంతకు ముందురోజు రాత్రే తొలిసారి శృంగారంలో పాల్గొంటాడు. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కూడా తనని ప్రేమిస్తుందనే నమ్మకంతో, తెల్లారి ఆమె ఇంటి నుండి బయటపడి, ఒక కొత్త రోజులోకి ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడ్తాడు. ఆమె తనను ప్రేమించడం లేదని, జాలి చూపించిందని, అంతేకాదు ఆ రాత్రే తనను విడిచి శాశ్వతంగా వెళిపోతుందని తెలిసేదాకా రోజంతా ఆనందంగానే గడుపుతాడు. (విచిత్ర సోదరుల్లో కమల్ హాసన్ గుర్తొస్తాడు.) అతని మొత్తం జీవితానికి ఆ ఒక్క రోజే ఆనందకరమైన రోజు, ఆ ఒక్క రోజే అతనికి బహుమతిగా సమర్పితమైన రోజు. కథ విషాదాంతం. నాకు నచ్చింది. కానీ చిత్రంగా నబొకొవ్‌కి నచ్చలేదట. పాతికేళ్ళ వయస్సులో రాసిన ఈ కథ గురించి నబకొవ్ తన డెబ్భైఅయిదోయేట ఇలా అన్నాడు: ". . . but all in all it is not my favorite piece, and if I include it in this collection it is only becasue the act of retranslating it properly is a precious personal victory that seldom falls to a betrayed author's lot."
ఇంతకీ నాకే బహుమతిగా ఇచ్చిన రోజులు ఏమై వుంటాయి? సింహావలోకనంలో, నబొకొవ్ అన్నట్టే, కొన్ని అనుకోని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి: నున్నగా మేటేసిన లంక ఇసుకలో కాలిముద్రలు పడేలా, ఆ కాలి ముద్రలు ఓ పెద్ద పేరుగా రూపుదిద్దుకునేలా పరిగెత్తడం. పైన వంతెన మీద పోయేవాళ్ళు—సైకిళ్ళ మీంచి, స్కూటర్ల మీంచి, బస్సు కిటికీల్లోంచీ—విచిత్రంగా క్రిందకి చూడడం. ఆ రోజు ఏ తేదీనో, ఏ నెలో, ఏ సంవత్సరమో కూడా గుర్తులేదు. కానీ ఇప్పుడు నాకు తెలుసు ఆ రోజు నాదని.