October 5, 2010

ఆకు పోక తమలపాకు...

నిత్యం రద్దీగా వుండే ఆ పుట్‌పాత్ మీద రోజూలాగే ఆ అబ్బాయి పరాగ్గా తన గమ్యం వైపు నడుస్తున్నాడు. రోడ్డు మీద పగటికలలు కనే తన అలవాటు జగద్విదితమని అతను రహస్యంగా నమ్ముతుంటాడు. అందుకే తనకు అడ్డురాకుండా, గుద్దుకోకుండా అప్రమత్తంగా నడిచే బాధ్యతను యితర పాదచారులకే వదిలిపెడ్తూంటాడు. అయితే ఇప్పుడు అతనికభిముఖంగా వస్తున్న అమ్మాయికి ఈ సంగతేమీ తెలియకపోవడమో, లేదా ఆమెదీ అదే తరహా పరధ్యానమో గానీ... తిన్నగా నడుచుకుంటూ వచ్చేస్తోంది. చివరిక్షణంలో ఆమెను గమనించేసరికే సమయం మించిపోయింది. ఉన్నపళాన ఆమెను డీకొన్నాడు. తల బొప్పికట్టినంత నొప్పి పుట్టింది. "సారీ" గొణిగి తల రుద్దుకుంటూ వెళిపోయాడు. ఆమె వైపు నుంచి కూడా ఒక "సారీ" వినిపించింది. నాలుగడుగులు నడిచేసరికి మళ్ళీ పగటికలల్లోకి జారిపోయాడు.

కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి మరలా అలాంటి ప్రమాదానికే గురవబోయి తృటిలో తప్పించుకున్నాడు. ఈసారి అవతలి వ్యక్తిని డీకొనడం ఇక తథ్యం అనగా, స్పృహలోకొచ్చాడు. పాదాలు బ్రేకు వేసినట్టు నేలకి అతుక్కుపోయాయి. శరీరం ఎదుటి అమ్మాయి మీదకి తూలిపడబోయినా, ప్రయత్నం మీద నిలదొక్కుకున్నాడు. తెప్పరిల్లి చూసేసరికి తనకు తెలియని అమ్మాయి సమక్షంలో చాలా దగ్గరగా వున్నట్టు గ్రహించాడు. ప్రక్కకు తొలగి వెళిపోయే అవకాశం ఆమెకే ఇవ్వాలని అలాగే వుండిపోయాడు. ఆమె కూడా అతనే తొలగి దారిస్తాడన్నట్టు అలాగే వుండిపోయింది. ఇద్దరూ ఎదురుబొదురు పాతుకుపోయినట్టుగా రెండుమూడు ఇబ్బందికరమైన క్షణాలు గడిపారు. చివరకు ఆమే తప్పుకుని తన దారిన వెళిపోయింది. అతని భ్రమో నిజమో తెలియదు, ఆమె విసుగ్గా మొహం పెట్టినట్టు తోచింది. కాసేపు తన మీద తనకే చిరాకు వేసింది.

ఎప్పుడూ ఏదో ఒక గమ్యం చేరుకోవాలనే అసహనంతో వుండే నగరజీవులు భౌతికంగా రోడ్ల మీద వుంటారే గానీ, మానసికంగా వుండరు. కాబట్టి అడపాదడపా ఒకరి తోవకు మరొకరు అడ్డుపడటాలూ, గుద్దుకోవడాలు సాధారణమే. కొన్ని రోజులు గడిచిం తర్వాత, ఆ అబ్బాయికి ఈ మాదిరి సంఘటనే మరోమారు పునరావృతమయ్యింది. దాదాపు ఎదుటి వ్యక్తిని గుద్దుకోబోయి చివరిక్షణంలో ఆగాడు. ఆమె కూడా కష్టం మీద నిలదొక్కుకుంది. రెండు మూడు సందిగ్ధ క్షణాలు గడిచాయి. ఆమె కాలి గోళ్ళకు కాషాయంలోకి వెలసిపోయిన గోరింటాకూ, భుజాన హాండ్‌బాగూ, వంటి మీద చింతపిక్కరంగు కలంకారీ అల్లికతో వున్న పసుపురంగు కాటన్ చుడీదారూ, అతని చైతన్యంలోకి చొరబడ్డాయి. ఆమెకు దారివ్వాలని తనే ప్రక్కకు తొలిగాడు. అయితే అదే సమయానికి ఆమె కూడా అతనికి దారివ్వాలని ప్రక్కకు తొలిగింది. మళ్ళీ ఇద్దరూ అభిముఖమయ్యారు. మళ్ళీ ప్రక్కకు తొలిగారు. మళ్ళీ అభిముఖమయ్యారు. పైన గాలిలో ఏదో కనపడని కొక్కేన్నించీ వ్రేలాడుతున్న లోలకపు అంచులా ఆ జంట అలా ఒకట్రెండుసార్లు ఊగిసలాడి ఆగారు. ఇందంతా యాదృచ్ఛికమనుకోకుండా ఆ అమ్మాయి తనకేదైనా కుటిలోద్దేశ్యాన్నిఆపాదిస్తుందేమోనని గాభరాపడ్డాడు. ఆమె ముఖంలోకి చూసాడు. కానీ అక్కడ దృశ్యం భిన్నంగా వుంది. సమ్మోహనంగా కూడా వుంది. ఇంతటి ప్రహసనాన్ని భరించడం ఇక తన వల్ల కానట్టూ ఆ అమ్మాయి ఫక్కున నవ్వేసింది. అబ్బాయి కూడా తేలికపడి నవ్వాడు. ఆమె ఎయిరిండియా మహారాజాను అనుకరిస్తూ, వినమ్రతను అభినయిస్తూ, మీరే వెళ్ళండి అన్నట్టు చేయి చూపించింది. ఆమెను దాటి వెళ్లిపోయింతర్వాత కూడా చాలాసేపు అతని పెదవులపై చిరునవ్వు అలానే వుంది.

నగరజీవుల మధ్య ప్రేమలు చిత్రాతిచిత్రమైన రీతుల్లో పుట్టడం సాధారణాతిసాధారణం. మరుసటి రోజు నుంచి ఇద్దరూ పుట్‌పాత్ మీద తారసపడినపుడు ఒకరినొకరు గుర్తించడం ప్రారంభించారు. చిరునవ్వులు చూస్తూచూస్తుండగానే పొడి పలకరింపుల్లోకి దినదినాభివృద్ధి చెందాయి. రోజూ వచ్చే సమయానికి ఆ అమ్మాయి హాండ్‌బాగ్‌తో వీధి మలుపు తిరగకపోతే అతను తన నడక వేగాన్ని నాటకీయంగా కుదించేవాడు. ఇంకా ఆలస్యమైతే ఆ పుట్‌పాత్ మీది బిచ్చగాళ్ళకూ, సిగరెట్‌ బడ్డీల వాళ్ళకూ అతని రూపేణా లాభసాటి బేరం తగిలేది. ఇలా కొన్ని రోజులు గడిచాకా, ఒకసారి అనుకోకుండా ఇద్దరూ ఓ బేకరీలో తారసపడ్డారు. అక్కడ వాళ్ళ సంభాషణ పేర్ల మార్పిడితో మొదలై, ఫోన్‌నెంబర్ల మార్పిడితో ముగిసింది. మనసుకూ మనసుకూ మధ్య మాటల వారధి మొదలైంది. సాయంత్రాలు పార్కు బెంచీల మీద గడుస్తున్నట్టు తెలియకుండానే గడిచిపోతున్నాయి. ఇటుక మీద ఇటుకేసి ఇల్లు కట్టినట్టు బంధం దృఢతరం కానారంభించింది. వాళ్లకర్థమయ్యే లోపునే వాళ్ళు ఒకరికొకరుగా మారిపోయారు.

ఒక రాత్రి ఆమెను హాస్టల్ దగ్గర దింపి సంతృప్త మనస్కుడై తన గదికి నడిచి వస్తున్నాడు. జీవితంలోని అయోమయాలన్నీ విశదమైన భద్రభావన. ఎందుకో తామిరువురి తొలి కలయికనూ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆమె నవ్వూ, పసుపురంగు చుడీదారూ, తనను వెళ్ళమన్నట్టు నాటకీయంగా చేయి చూపించడం... అతనికి నవ్వొచ్చింది. వీటితోపాటే హఠాత్తుగా మరో రెండు దృశ్యాలు గుర్తొచ్చాయి. తాను అంతకుముందెపుడో రెండు సందర్భాల్లో ఇలానే ఇద్దరమ్మాయిల్ని డీకొనబోయాడు. అప్పట్నించీ వాళ్ల సంగతి మరలా గుర్తు రావడం ఇదే మొదటిసారి. అతనింకా తమ బంధపు మూలాలపై విశ్వాసాన్ని ప్రోదిచేసుకుంటున్న మానసికావస్థలోనే వున్నాడు. ఆ ఆవశ్యకత అతని ఆలోచనల్ని ఏవేవో నిర్హేతుకమైన మూలలకు మళ్ళిస్తోంది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో తను ఎందుకు ప్రేమలో పడలేదు? ఈ అమ్మాయితోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు? ఆ సందర్భాల్లో ఇద్దరమ్మాయిల ప్రతిస్పందనల్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాలు చూచాయగా అంచనావేశాడు. వాళ్లలో మొదటి అమ్మాయి తనలాగా మూగ స్వాప్నికురాలే కావచ్చు. ఒక జంటలో ఇద్దరిదీ ఒకే తరహా వ్యక్తిత్వాలవడం మంచిది కాదంటారు. రెండో అమ్మాయి తనకంటూ ఒక మానసిక ప్రపంచమే లేని డొల్లపదార్థంలా కన్పించింది. అలాంటి వాళ్ళు నడిచే పీడకలల్లా భయపెడ్తారు. కేవలం మూడో అమ్మాయే కాసిని కలలూ, కాసిని నవ్వుల్తో తన జీవితాన్ని పరిపూర్ణవృత్తంగా మార్చగల అమ్మాయి. అందుకే తను ఆమెతో ప్రేమలో పడ్డాడు. దొరికింది కదాని ఈ అమ్మాయిని ప్రేమించటం లేదు. తానీ అమ్మాయిని ఎన్నుకున్నాడు. ఈ అమ్మాయి తనని ఎన్నుకుంది. తామిరువురి వ్యక్తిత్వాలూ ఒకే యంత్రపు పళ్లచక్రాల్లా అచ్చంగా అమిరాయి. ఇంకా చెప్పాలంటే ఈ అమ్మాయిని సృష్టి తనకోసం కేటాయించింది. ఇరువురికీ రాసిపెట్టివుంది. ఇలా ఆలోచించగా, తనని ప్రేమలో పడేయడంలో సృష్టి ఓ క్రమబద్దమైన పద్ధతిని అనుసరించినట్టు తోచి ఎక్కడలేని సంతోషం కలిగింది. చుక్కలు పొదిగివున్న ఆకాశం వైపు తలెత్తి చూస్తూ, కృతజ్ఞతా సూచకంగా గుండెపై పిడికిలి తాకించాడు, ఆ పిడికిల్ని పెదాలకు ఆన్చి ముద్దు పెట్టుకున్నాడు.

పైన దేవలోకంలో అతని ఆలనాపాలనా చూసుకునేందుకు నియమించబడిన దేవతకు ఈ కృతజ్ఞత అందింది. అతణ్ణించి కృతజ్ఞతల్ని అరుదుగా మాత్రమే ఆశించటానికి అలవాటుపడిన ఆ దేవత, చాలా సంతోషించింది. ఆ వేళ ఇరుగుపొరుగు దేవతలందరికీ ఈ సంగతి చెప్పుకుని మురిసింది. వాళ్ళలో ఒకరు స్వయానా ఆ అబ్బాయి ప్రేయసి తాలూకూ దేవత. విషయమంతా విన్న తరువాత ఆ దేవత యిలా అంది: "కానీ అతను మూడుసార్లు కలుసుకున్నదీ ఈ అమ్మాయినే. మొదటి రెండుసార్లూ సరిగా చూడలేదంతే!"
.