May 23, 2014

'చైనా గోడ' - ఫ్రాంజ్ కాఫ్కా

(కాఫ్కా "ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా"కు నా అనువాదం)


చైనా గోడ నిర్మాణం ఉత్తరం హద్దు దాకా పూర్తయిపోయింది. ఆగ్నేయం నుంచి ఒక భాగమూ, నైరుతి నుంచి ఒక భాగమూ వచ్చి ఇక్కడ కలిశాయి. వీటిని ఇరు వైపుల్నుంచీ కట్టుకుంటూ వచ్చిన రెండు భారీ శ్రామిక బృందాలూ (ఆగ్నేయ బృందం, నైరుతి బృందం), ఎవరి భాగంలో వాళ్ళు మళ్ళా ఇలా విడి విడి భాగాలుగా కట్టుకుంటూ వచ్చే పద్ధతినే పాటించారు. ఇదెలా జరిగేదో చెప్తాను: ఇరవయ్యేసి మంది శ్రామికులు ఒక గుంపుగా పని చేసేవారు, వీళ్ళంతా కలిసి, ఉదాహరణకి, ఒక ఐదొందల గజాల గోడ కట్టారనుకుందాం, ఈ లోగా అటు వైపు నుంచి ఇలాంటి గుంపే ఇంకొకటి ఇంతే పొడవు గల గోడ కట్టుకుంటూ వచ్చి, దాన్ని దీనితో కలిపేది. కానీ, ఇలా కలపటం అయ్యాకా, ఈ వెయ్యి గజాల గోడ పూర్తయిన చోట నుంచి మళ్లీ నిర్మాణం మొదలయ్యేది కాదు; దానికి బదులు ఈ రెండు గుంపుల్నీ వేరే దూర ప్రదేశాలకు బదిలీ చేసేవారు, వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా ఇదే పద్ధతిలో గోడ కట్టాలి. ఈ పద్ధతి వల్ల సహజంగానే మధ్య మధ్యలో చాలా పెద్ద ఖాళీలు మిగిలిపోయాయి, అవన్నీ తర్వాతెప్పుడో ఒక్కొక్కటిగా పూడ్చుకుంటూ వచ్చారు, కొన్ని ఖాళీలైతే గోడ పూర్తయిపోయిందంటూ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఇంకా పూడుస్తూనే ఉన్నారు. అసలు ఇప్పటికీ కొన్ని ఖాళీలు అలాగే ఉండిపోయాయని కొందరంటారు, కానీ ఈ గోడ నిర్మాణం మొదలైందగ్గర్నించీ పుట్టుకొస్తున్న లెక్కలేనన్ని పుకార్లలో ఇవి కూడా ఒకటి, వీటి నిజానిజాల్ని నిగ్గు తేల్చటం చాలా కష్టం, ఏ ఒక్క మనిషి వల్లో అయ్యే పని కాదు, ఈ నిర్మాణపు భారీతనం అలాంటిది మరి.

గోడని ఇలా విడి విడి భాగాలుగా కట్టే పద్ధతి చాలామందికి విడ్డూరంగా తోచవచ్చు. వరుసగా కట్టుకుంటూపోతే ఏమైంది? అసలు ఈ గోడ ఉద్దేశమే ఉత్తరం వైపున్న తండాల వాళ్ళ నుంచి రక్షణ కోసమని కదా, మరి ముక్కలు ముక్కలుగా ఉండే గోడ రక్షణ ఎలా ఇవ్వగలదు? రక్షణ ఇవ్వడం అటుంచి, అసలు దానికే రక్షణ ఉండదు కదా. నిర్జన బయళ్ళలో ఒంటిగా నిలబడి ఉండే ఇలాంటి గోడ భాగాల్ని ఆ తండాల వాళ్ళు చాలా సులువుగా ఎన్నిసార్లు కట్టినా కూల్చేయగలరు, పైగా ఈ గోడ నిర్మాణం కలగజేసిన ఆందోళనతో ఆ తండాలవాళ్ళు చాలా వేగంగా, మిడతదండుల్లా, తమ విడిదుల్ని ఒకచోట నుంచి ఒకచోటికి మారుస్తూనే వుండేవారు, దాంతో గోడ కట్టిన మాకన్నా కూడా బహుశా వీళ్ళకే దాని ఆనుపానుల పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండేదేమో అనిపించేది. అయినప్పటికీ ఈ నిర్మాణానికి ఈ పద్ధతి తప్ప మరోటి అనుసరించే వీల్లేదనిపిస్తుంది. ఎందుకో తెలియాలంటే ముందొకటి అర్థం చేసుకోవాలి: గోడ కట్టింది శతాబ్దాల పాటు నిలిచి రక్షణగా ఉండటానికి; కాబట్టి కట్టుబడిలో నిశితమైన శ్రద్ధా, శతాబ్దాల తరబడి మానవాళి సముపార్జించిన నిర్మాణ కౌశలాన్నంతా వాడటమూ, నిర్మించేవారిలో మొక్కవోని దీక్షా – ఇవన్నీ ఈ పనికి తప్పనిసరి అర్హతలు. శారీరకమైన పనులకు మామూలు శ్రామికులు – డబ్బులిస్తే పనిచేసే మగవాళ్ళూ, ఆడవాళ్ళూ, చిన్నపిల్లలూ – సరిపోతారు; కానీ వీళ్ళలో ఏ నలుగురు శ్రామికుల్ని పర్యవేక్షించాలన్నా నిర్మాణశాస్త్రం లోతుగా తెలిసిన నిపుణుడు ఒకడు కావాలి, అతను పనికి పూర్తిగా అంకితమైపోయి అందులో తన హృదయాన్ని చొప్పించగలవాడై ఉండాలి. పని స్థాయి ఒక్కో మెట్టూ పెరిగే కొద్దీ దాని పట్ల బాధ్యతా పెరగాలి. అలాంటి వ్యక్తులు ఉన్నారు కూడా – గోడ నిర్మాణానికి అవసరమైనంత ఇబ్బడిముబ్బడిగా లేకపోయినా, పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ఈ పనేం అంత అల్లాటప్పాగా తలపెట్టింది కాదు. మొదటి రాయి ఇంకా పేర్చక మునుపు, యాభై ఏళ్ళ క్రితం నుంచే, మొత్తం చైనాలో ఏ ప్రాంతాల చుట్టూ గోడ కట్టబడుతుందో ఆ ప్రాంతాలన్నింటిలోనూ నిర్మాణ కళని, అందులో మళ్ళా ముఖ్యంగా తాపీ పనిని, ఒక ముఖ్యమైన విజ్ఞాన శాస్త్రంగా ప్రకటించారు, దీనితో అంతో ఇంతో సంబంధమున్న ఇతర శాస్త్రాలే గుర్తింపుకు నోచుకున్నాయి. నాకు ఇప్పటికీ జ్ఞాపకమే, బాగా చిన్నపిల్లలం, నడక నేర్చి కూడా ఎంతో కాలమై ఉండదు, మా గురువుగారి పెరడులో ఉన్నాం, గులకరాళ్ళతో ఒక గోడ కట్టమని ఆదేశించారు; మా తంటాలు మేం పడ్డాకా, గురువుగారు తన అంగ వస్త్రాన్ని నడుం చుట్టూ బిగించి, ఒక్క ఉదుటున ఆ గోడ మీదికి దూసుకెళ్ళారు, అది కూలిపోక ఏం చేస్తుంది, అప్పుడిక మా పేలవమైన కట్టుబడికి ఆయన మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టారంటే, మేం ఏడ్చుకుంటూ తలోదిక్కూ పరిగెత్తి మా అమ్మానాన్నల వళ్లో తలదాచుకున్నాం. చిన్న సంఘటనే, కానీ ఆ కాలపు స్వభావానికి అద్దం పట్టే సంఘటన.

ఇరవయ్యేళ్ళ వయస్సులో నేను తుది పరీక్షల్లో ఉత్తీర్ణుణ్ణయిన సమయంలోనే గోడ నిర్మాణం మొదలవటం నా అదృష్టమనే చెప్పాలి. అదృష్టమని ఎందుకంటున్నానంటే, నాకన్నా ముందు ఉత్తీర్ణులయిన చాలామంది యువకులు, తమకు అందుబాటులో ఉన్న విజ్ఞానమంతా సముపార్జించి కూడా, దాన్ని వాడేందుకు తగిన తావు ఏదీ లేక, తమ మెదడులో అద్భుతమైన నిర్మాణ రచనల్ని మోసుకుంటూ, ఏళ్ళ తరబడి నిష్పలంగా తిరిగేవారు, వేలాదిమంది చివరకు అలాగే నిస్పృహలో కూరుకుపోయారు. కానీ ఒకసారి గోడ పని ప్రారంభమయ్యాకా వీళ్ళలో పర్యవేక్షకులుగా నియమితులైన వారు మాత్రం, తమకు ఇచ్చింది ఎంత దిగువ హోదా ఐనా సరే, తాము అందుకు అచ్చంగా అర్హులమేనని నిరూపించుకున్నారు. ఈ తాపీమేస్త్రీలు గోడ నిర్మాణం గురించి ఆలోచించటం ఎప్పుడూ ఆపలేదు, పునాది రాయి నేలలో పడిన క్షణం నుంచీ గోడలో తామూ ఒక భాగమైపోయినట్టు భావించారు. ఇలాంటి తాపీమేస్త్రీల్లో తమ విధుల్ని అత్యంత క్షుణ్ణంగా నిర్వహించాలన్న కోరికతో పాటూ, గోడ వెంటనే పూర్తయి తమ కళ్ళ ముందు నిలబడితే చూడాలన్న అసహనం కూడా ఉండేది. అదే వాళ్ళని ముందుకు ఉసిగొల్పేది. ఇటు శ్రామికుల్లో ఇలాంటి అసహనం ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళని ముందుకు ఉసిగొల్పేది వాళ్ళ కూలి డబ్బులే. అలాగే అటు పైస్థాయి పర్యవేక్షకులూ, మధ్యస్థాయి పర్యవేక్షకులూ కూడా, గోడ ఏయేచోట్ల ఎంతెంత పూర్తవుతోందో గ్రహించగలిగే హోదాలో ఉన్నవాళ్ళు గనుక, తమ ఉత్సాహాన్నీ విశ్వాసాన్నీ నిలబెట్టుకోగలిగేవారు. కానీ దిగువ స్థాయి పర్యవేక్షకులున్నారే, వీళ్ళు తాము నిర్వర్తిస్తున్న నేలబారు విధులకు మించిన మేధస్సు కలవాళ్ళు, వీళ్ళలో ఉత్సాహం చచ్చిపోకుండా ఉండటానికి వేరే పద్ధతి పాటించాల్సి వచ్చింది. ఎందుకంటే మరి ఇలాంటి వాళ్ళు, తమ ఇళ్ళకు వందలాది మైళ్ళ దూరంలో, నిర్జన కొండ ప్రాంతాల్లో, నెలల తరబడి, ఒక్కోసారి ఏళ్ళ తరబడి, ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ ఎన్నాళ్ళని పని చేయగలరు; ఏ ఆశా లేని ఈ కఠోర ప్రయాస వాళ్ళని నిస్పృహ వైపుకు నెడుతుంది, అంతకన్నా ముఖ్యంగా వాళ్ళ పనితీరుని కుంటుపడేలా చేస్తుంది. అదిగో అందుకే, ఇలా గోడని విడి భాగాలుగా కట్టే పద్ధతి ఎన్నుకోబడింది. ఐదొందల గజాల గోడ పూర్తి కావటానికి ఉజ్జాయింపుగా ఐదేళ్ళు పట్టేది; కానీ అప్పటికే పర్యవేక్షకులు తీవ్రంగా అలసిపోయి, ఇక తమ మీదా, గోడ మీదా, మొత్తం ప్రపంచ మీదే విశ్వాసం లేని స్థితిలో ఉండేవారు. అందుకే, వాళ్ళు రెండు గోడలు కలిపి వేయి గజాల గోడ పూర్తి చేసిన ఆనంద సంబరాల్లో ఇంకా మునిగితేలుతుండగానే, వాళ్ళని వేరే ఎక్కడో సుదూర ప్రాంతానికి బదిలీ చేస్సేవారు. అక్కడికి వెళ్ళే ప్రయాణమార్గంలో వాళ్ళు అక్కడక్కడా పూర్తయిన గోడ భాగాల్ని చూస్తారు, అధిష్టానం విడిది చేసిన శిబిరాల మీదుగా వెళ్తారు, అక్కడ వాళ్ళకి గౌరవ పతకాలు ప్రదానం చేయబడతాయి, దేశం నలుమూలల నుంచీ ఉత్సాహంగా తరలి వస్తున్న కొత్త శ్రామిక బృందాలు వాళ్ళకు ఎదురవుతాయి, గోడకి ఊతంగా నిలబెట్టేందుకు కావాల్సిన కలప కోసం అడవులు కొట్టివేయడాన్ని చూస్తారు, గోడకి ఇటుక రాళ్ళను సరఫరా చేయటానికి కొండలు పిండవటం చూస్తారు, గోడ విజయవంతంగా పూర్తి కావాలని మొక్కుకుంటూ పుణ్యక్షేత్రాల్లో భక్తులు చేస్తున్న ప్రార్థనల్ని వింటారు. ఇదంతా వాళ్ళ అసహనాన్ని చల్లార్చేది. మార్గమధ్యంలో ఇంటి దగ్గర తీసుకున్న కొద్ది కాలపు విరామమూ వాళ్ళని మరింత కార్యోన్ముఖుల్ని చేసేది; తాము గోడ గురించి చెప్తున్నపుడు వినటంలో ఊరివాళ్ళు చూపించే శ్రద్ధాసక్తులూ, అక్కడ నింపాదిగా బతికేసే ప్రతీ మామూలు పౌరుడూ ఏదో ఒక రోజు గోడ పూర్తయి తీరుతుందంటూ వ్యక్తం చేసే ఆశాభావం – ఇవన్నీ వాళ్ళ గుండె తంత్రుల్ని మీటి వారిలో నూతనోత్తేజాన్ని నింపేవి. అప్పుడిక వాళ్ళు, నిరంతరం ఆశతో వెలిగిపోయే పసిపిల్లల్లా, తమ ఇళ్ళకు వీడ్కోలు పలికేవారు; దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న గోడ కోసం మళ్ళీ తమ వంతు పని మొదలుపెట్టాలన్న కోరిక వాళ్ళను నిలవనిచ్చేది కాదు. బయల్దేరాల్సిన సమయం కన్నా ముందే బయల్దేరిపోయేవారు; వాళ్ళను సాగనంపటానికి ఊరు ఊరంతా చాలా దూరం వెంట నడిచేది. ఎగురుతున్న జండాలతో, పతాకాలతో రోడ్లన్నీ కిటకిటలాడేవి; వాళ్ళకు తమ దేశం ఎంత గొప్పదో, సుసంపన్నమైనదో, అందమైనదో, ప్రేమాస్పదమైనదో ఇదివరకెన్నడూ లేనంతగా అర్థమయ్యేది. తోటి దేశీయుడు ప్రతీ ఒక్కడూ తమ సోదరుడే, వాళ్ళ రక్షణ కోసమే తామీ గోడ కడుతున్నారు, దీనికి వాళ్ళు జీవితాంతం కృతజ్ఞులై ఉంటారు. ఐక్యతే ఐక్యత! చెట్టాపట్టాలేసుకుని, అంతా ఒక సమూహంగా కలిసి కదులుతారు, వారి రక్త ప్రసరణ ఇక తమ దేహాలకు మాత్రమే పరిమితమై ఉండదు, అంతులేని చైనా విస్తారాల గూండా తీయగా పారుతూ, తిరిగి తిరిగి వస్తూంటుంది.

ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, గోడని విడి భాగాలుగా కట్టడంలోని ఆంతర్యం తేలిగ్గానే బోధపడుతుంది. ఇవే గాక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఒక్క విషయం మీదే నేను ఇంత సేపు వివరణ ఇవ్వడంలో కూడా పెద్ద వింతేమీ లేదు. పైకి అంత ముఖ్యమైన విషయంగా కనిపించకపోయినా, నిజానికి గోడ నిర్మాణంలో ఇదో కీలకమైన అంశం. ఆనాటి ఆలోచనల్నీ అనుభవాల్నీ ఇప్పుడు అర్థమయ్యేలా చేయాలంటే, ఈ విషయంపై ఎంత మాట్లాడినా సరిపోదు.

మొదటగా చెప్పాల్సిందేమిటంటే, ఆ రోజుల్లో, బేబెల్ బురుజుకు[1] ఏ మాత్రం తీసిపోని నిర్మాణాలు చేపట్టబడేవి, కానీ దైవానుగ్రహం విషయంలో మాత్రం ఆ నిర్మాణానికి పట్టిన గతి వీటికి పట్ట లేదు. ఇదెందుకు చెప్తున్నానంటే, గోడ నిర్మాణం మొదలైన తొలి రోజుల్లో ఒక పండితుడు తాను రాసిన పుస్తకంలో ఈ పోలికను ప్రస్తావించాడు. అందులో ఆయన ఏమంటాడంటే, బేబెల్ బురుజు తన లక్ష్యాన్ని సాధించలేకపోవటానికి కారణం అందరూ అనుకునేది కాదట, ఇంకోలా చెప్పాలంటే, అందరికీ తెలిసిన కారణాల్లో అసలు కారణం లేదుట. ఆయన చూపించిన ఋజువులు పురాణాల పైనా, పుక్కిటి కథలపైనా ఆధారపడినవి కావట; ఆయన స్వయంగా ఆ స్థలానికి వెళ్ళి మరీ పరిశోధించాడట, తద్వారా బేబెల్ బురుజు కూలిపోవటానికి అసలు కారణం దానికి వేసిన పునాదులు బలహీనంగా ఉండటమే అని తేల్చి చెప్పాడు. ఈ విషయంలో మాత్రం ప్రాచీన కాలంతో పోలిస్తే మా కాలం ఎన్నోరెట్లు మెరుగైనదనే చెప్పాలి. మా కాలంలో దాదాపు చదువుకున్న ప్రతీ వాడూ వృత్తి రీత్యా తాపీమేస్త్రీనే, పునాదులు వేయటంలో ఆరితేరినవాడే. అయితే ఆ పండితుడు నిరూపించదల్చుకున్నది ఇది కాదు; బేబెల్ బురుజు కొత్తగా మరోసారి కట్టడానికి వీలుకల్పించేలా మానవాళి చరిత్రలో తొలిసారిగా ఒక పటిష్టమైన పునాది ఏర్పాటుకానుందనీ, అది సాక్షాత్తూ మా చైనా గోడే అనీ అంటాడాయన. ముందు గోడ నిర్మించాకా, దాన్ని పునాదిగా వాడుకుంటూ బురుజు నిర్మించవచ్చట. ఆ రోజుల్లో ఎవరి చేతుల్లో చూసినా ఆయన పుస్తకమే కనపడేది, కానీ నా మట్టుకు నాకు ఈవేళ క్కూడా ఆయన బురుజుని ఎలా కట్టాలనుకున్నాడో అర్థం కాదు. అసలు వలయాకారంలోనే లేని ఈ గోడ, మహ అయితే పావు వలయమో, అర్థవలయమో కాగల ఈ గోడ, ఒక బురుజుకి ఎలా పునాది కాగలదు? బహుశా ఏదో వేదాంతార్థంలో ఆ మాట అని ఉంటాడనుకోవచ్చు. మరి అలాగైతే, కళ్ళ ముందు ఖచ్చితమైన వాస్తవంగా కనిపించే గోడ నిర్మించడం ఎందుకు, దానికి గాను లెక్కలేనంతమంది జనం జీవితాంతం శ్రమించడం ఎందుకు? పైగా ఆ పుస్తకంలో పక్కా నిర్మాణపటాలు కూడా గీసి పెట్టి ఉండేవి (కొంత అస్పష్టమైన ప్రణాళికలే అనుకోండీ), ఈ బృహత్ నూతన కార్యక్రమానికి జనశక్తిని ఎలా చైతన్యవంతం చేయాలన్న దానిపై సవివరమైన ప్రతిపాదనలు కూడా ఉండేవి.

అప్పట్లో జనం బుర్రలు ఎన్నో చిత్రమైన ఆలోచనలతో కిక్కిరిసి ఉండేవి – అందుకు ఈ పండితుడి పుస్తకం ఒక ఉదాహరణ మాత్రమే – ఒక ఉమ్మడి లక్ష్యం కోసం అంతా కలిసికట్టుగా తమ బలాబలాల్ని సమీకరించుకునే ప్రయత్నంలో ఉండటమే దీనికి కారణం కాబోలు. మనిషి స్వభావం చంచలమైనది, సుడిగాలిలా అస్థిరమైనది, అది ఏ హద్దుల్నీ అంగీకరించదు; తనను తానే బంధించుకుంటుంది, మరుక్షణం ఆ బంధనాల్ని తెంపుకోవటానికి పిచ్చిగా గింజుకుంటుంది, ఆ ప్రయత్నంలో అన్నింటినీ విచ్ఛిన్నం చేస్తుంది, గోడల్నీ, బంధనాల్ని, ఆఖరుకు తనని తాను కూడా.

అధిష్టానం గోడని ఇలా విడిభాగాలుగా నిర్మించే పద్ధతిని ఎన్నుకున్నప్పుడు అసలు గోడ నిర్మాణాన్నే ప్రశ్నార్థకం చేసే ఇలాంటి అంశాల్ని కూడా పరిగణనలోకి తీసుకునే ఉంటుంది. అధిష్టానం మాకు – నేను చాలామంది తరపున మాట్లాడుతున్నాను – జారీ చేసిన ఆదేశాల్ని జాగ్రత్తగా పరిశీలించిన మీదట అర్థమైంది ఏమిటంటే, అధిష్టానం అనేదే ఒకటి లేకపోయుంటే మా పుస్తక పరిజ్ఞానమూ, మా మానవ మేధస్సూ అంతా కలిసినా కూడా ఓ పెద్ద ప్రణాళికలో అంతర్భాగమైన మా ఈ చిరుకార్యాలను నెరవేర్చటానికి ఎందుకూ పనికివచ్చేవి కావు. ఆ అధిష్టాన కార్యాలయంలో – అది ఎక్కడ ఉందో, అందులో ఎవరుంటారో నేను అడిగిన వారెవ్వరికీ తెలియదు – ఆ కార్యాలయంలో మానవాళి అన్ని ఆలోచనలూ - లక్ష్యాలూ, కోరికలూ - నెరవేరటాలూ అన్నీ ఎదురెదురు దిశల్లో పరిభ్రమిస్తుంటాయనిపిస్తుంది. అక్కడి అధికారులు నిర్మాణ పటాలు గీస్తున్నప్పుడు కిటికీల్లోంచి ప్రసరించే దైవిక ప్రపంచాల వెలుగులు వారి చేతులపై పడి ప్రకాశిస్తుంటాయనిపిస్తుంది.

మరి ఇంతటి శక్తివంతమైన అధిష్టానం నిజంగా తల్చుకుంటే గోడ నిర్విరామంగా కట్టుకుపోయే పద్ధతిలో ఎదురయ్యే సమస్యల్ని కూడా ఎదుర్కోగలదని ఏ తటస్థ పరిశీలకుడైనా గ్రహించగలడు. దీన్నిబట్టి గోడ విడి భాగాలుగా కట్టుకుపోయే పద్ధతిని అధిష్టానం ఉద్దేశపూర్వకంగా ఎంచుకుందన్న తీర్మానానికి రావాల్సి వస్తుంది. కానీ ఈ విడిభాగాలుగా కట్టే పద్ధతి కేవలం ఆపద్ధర్మం మాత్రమే, కాబట్టి తగినది కాదు. దీన్నిబట్టి అధిష్టానం తగని పద్ధతినే ఎంపిక చేసుకుందన్న తీర్మానానికి రావాల్సి వస్తుంది. చిత్రమైన తీర్మానమే, కాదనను. కానీ ఒక రకంగా చూస్తే దీని పక్షానా కొంత సమర్థన ఉంది. ఇప్పుడైతే దాన్ని చర్చించుకోవటంలో పెద్ద ప్రమాదమేమీ లేదు. ఒకప్పుడు మాత్రం పరిస్థితి వేరేలే ఉండేది. ఆ రోజుల్లో చాలామంది, జ్ఞానులైనవాళ్లు కూడా, ఒక సూత్రాన్ని నమ్మేవారు. అదేమిటంటే: నీ శక్తి మేరా అధిష్టానపు ఆదేశాల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, కానీ ఒక స్థాయి వరకూ మాత్రమే; దాన్ని దాటి ఆలోచించకు. ఈ సూత్రాన్ని ఒక పోలికతో కూడా ఉదహరించేవారు: దాన్ని దాటి ఆలోచించకు, అదేదో ప్రమాదమని కాదు; ప్రమాదమని చెప్పటానికి ఏ ఋజువూ లేదు. అయినా ఏది ప్రమాదమూ, ఏది కాదూ అన్నది కాదిక్కడ విషయం. వసంతకాలంలో నది ఎలా ఉంటుందో గుర్తు తెచ్చుకో. దాని మట్టమూ వడీ పెరుగుతుంది, చెరివైపూ ఉన్న ఒడ్డుల్ని సారవంతం చేస్తూ పారుతుంది, అయినా సముద్రాన్ని చేరే వరకూ తన దిశని ఖచ్చితంగా నిలుపుకుంటుంది, అర్హమైన అతిథి గనుక అక్కడ దానికి బ్రహ్మాండమైన స్వాగతం అందుతుంది. – ఇదిగో అధిష్టానపు ఆదేశాలపై నీ పరిశోధనల్ని ఈ మాత్రం దాకా అనుమతించుకోవచ్చు. – కానీ ఆ తర్వాత నది మట్టం ఒడ్డుల్ని ముంచెత్తేంతగా పెరుగుతుంది, దాని రూపాన్నీ పరిధుల్నీ కోల్పోతుంది, ప్రవాహ వడి తగ్గుతుంది, తన గమ్యాన్ని మర్చిపోయి ఊళ్లలోనే చిన్న చిన్న చెరువుల్ని ఏర్పరుస్తుంది, పొలాల్ని నాశనం చేస్తుంది, అయినా తన ఈ నూతన విస్తృతిని ఎక్కువకాలం నిలుపుకోలేదు, చివరికి తన ఒడ్డుల మధ్యకు వచ్చి ఒదగక తప్పదు, ఆ తరవాత వేసవి ముదిరాక పేలవంగా ఎండిపోకా తప్పదు. – ఇదిగో అధిష్టానపు ఆదేశాలపై నీ పరిశోధనల్ని మరీ ఇంత దాకా అనుమతించుకోవటం మంచిది కాదు.

గోడ కడుతున్నన్నాళ్లూ ఈ పోలికకు చాలా ప్రాముఖ్యతా ఔచిత్యమూ ఉన్నా, నా ప్రస్తుత వ్యాసం విషయంలో దాని అన్వయం చాలా పరిమితం మాత్రమే. నాది పూర్తిగా చారిత్రక దృష్టిగల పరిశోధన; ఎప్పుడో మాయమైన మబ్బుల్లోంచి ఇక ఇప్పుడు ఏ పిడుగులూ వచ్చిపడవు, కాబట్టి అప్పుటి ప్రజలు ఈ విడిభాగాల పద్ధతి గురించి ఏ వివరణలతో సరిపుచ్చుకున్నారో వాటిని దాటి నేను ముందుకు వెళ్లే వీలుంది. నా ఆలోచనాశక్తి నాపై విధించే హద్దులు ఎన్నో ఉండనే ఉన్నాయి, కానీ ప్రయాణించాల్సిన విస్తారాలు మున్ముందు ఎన్నో ఉన్నాయి.

ఎవరి నుంచి ఈ గోడ మాకు రక్షణ ఇవ్వాలి? ఉత్తరం వైపున్న తండాల నుంచి. ఇప్పుడు నేను వచ్చింది దక్షిణ చైనా నుంచి. అక్కడ ఏ ఉత్తరాదివాళ్లూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. వాళ్ల గురించి మేము ప్రాచీనగ్రంథాల్లో మాత్రమే చదువుకుంటాం; స్వభావానుగుణంగా వారు సాగించే అకృత్యాలు చదివి మా ప్రశాంతమైన లోగిళ్లలో నిట్టూర్పులు విడుస్తాం. చిత్రకారులు ఈ పాపాత్ముల్ని చాలా వాస్తవికరీతిలో చిత్రిస్తారు; తెరిచిన నోళ్లూ, పదునైన పళ్లున్న దవడలూ, వాటితో చీల్చిచెండాడబోయే తమ బాధితుల రక్తపు రుచిని ఆశిస్తూ ముందే మూతలుపడ్డ కళ్లూ ఇవన్నీ చూస్తాం. మా పిల్లలు అల్లరి చేస్తే వాళ్లకు ఈ బొమ్మలు చూపిస్తాం, అంతే, వాళ్లు వెంటనే ఏడ్చుకుంటూ మా సందిళ్లలో దూరిపోతారు. కానీ ఇంతకన్నా ఈ ఉత్తరాదివాళ్ల గురించి మాకింకేమీ తెలియదు. వాళ్లని మేం ఎప్పుడూ చూడలేదు, మా ఊళ్లలోనే ఉండిపోతే ఎప్పటికీ చూడబోము కూడా, ఒకవేళ వాళ్లు తమ అడవి గుర్రాలెక్కి శక్తి మేరా స్వారీ చేస్తూ ఇటు వైపు దూసుకువచ్చినా కూడా ఈ అంతుపొంతూ లేని విస్తారాలు దాటి మమ్మల్ని ఎప్పటికీ చేరుకోలేరు, వాళ్ల ప్రయాణం గాల్లోనే ముగిసిపోతుంది.

ఇలాంటప్పుడు మరి మేం ఎందుకు మా ఇళ్లు వదిలిపెట్టి వచ్చాం? వంతెనల కింద పారే ఏరునీ, మా తల్లుల్నీ తండ్రుల్నీ, ఏడ్చే మా భార్యల్నీ, మా సంరక్షణ అవసరమైన బిడ్డల్నీ వదిలిపెట్టి, ఎందుకు సుదూరమైన నగరంలో శిక్షణకు బయల్దేరాం, ఎందుకు మా ఆలోచనల్ని ఇంకా దూరంలో ఉత్తరాదిన ఉన్న గోడ మీదకు ఎక్కుపెట్టాం? ఎందుకు? అధిష్టానానికి ఈ ప్రశ్న. వాళ్లకు మేం తెలుసు. పెద్ద పెద్ద ఆందోళనల్లో నిమగ్నమై ఉన్న మా నాయకులకు మా గురించి తెలుసు, మా చిరు ప్రయత్నాలు తెలుసు, మేము మా చిన్న పాకల్లో గుమిగూడి కూర్చోవటం చూస్తారు, చుట్టూ కుటుంబం కూర్చొని ఉండగా ఇంటి పెద్ద వల్లించే ప్రార్థనల్ని ఆమోదించటమో తిరస్కరించటమో చేస్తారు. అధిష్టానం గురించి ఇలాంటి ఆలోచనల్ని వెల్లడించటానికి నాకు అనుమతి ఉందో లేదో తెలియదు, ఒకవేళ ఉంటే మాత్రం నా అభిప్రాయంలో అధిష్టానం అనేది చాలా కాలం నుంచే ఉందని చెప్పాలి, అదేదో ఇప్పటికిప్పుడు కొలువుదీరి ఎవరి పగటికలనో చర్చించి అంతే హడావుడిగా సభ ముగించి అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని – ఆ నిర్ణయం నిన్న తమ పట్ల దయ చూపించిన దేవుళ్ల ముందు ఒక చిన్న దీపం వెలిగించటం మాత్రమే అయినా సరే, దాన్ని – అమలు చేయటానికి అదే రోజు రాత్రి ప్రజల్ని తమ పడకల్లోంచి లేపి బెత్తాలతో చీకట్లోకి తరిమింది కాదు. అధిష్టానం అనాదిగా నుంచీ ఉంటున్నదే అనీ, గోడ కట్టాలన్న నిర్ణయమూ అంతేననీ నేన్నమ్ముతాను. పాపం ఇది తెలియక తామే దానికి కారణమనుకునే ఉత్తరాదివాళ్లు! ఇది తెలియక తానే దీనికి ఆదేశమిచ్చాననుకునే మహరాజు! గోడ కట్టే మాకు తెలుసు అది నిజం కాదని, మేం నోరు మెదపం.

*

గోడ నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా నేను జాతుల తులనాత్మక చరిత్రను అధ్యయనం చేయటంలో నిమగ్నమై ఉన్నాను – ఈ పద్ధతి ద్వారా మాత్రమే కొన్ని ప్రశ్నల్ని మూలాల దాకా తరిచిచూడగలం – అలా నేను తెలుసుకున్నదేమంటే మా చైనీయులకు ఉన్న ప్రజా, రాచరికపు వ్యవస్థలు కొన్ని తమ పారదర్శకతలో తిరుగులేనివైతే, మరికొన్ని అస్పష్టతలో తిరుగులేనివి. ఈ స్థితికి, ముఖ్యంగా రెండో స్థితికి కారణమేంటో వెతకాలన్న కోరిక నన్ను ఎప్పట్నించో పట్టిపీడించేది, ఇప్పటికీను. అసలు ఈ గోడ నిర్మాణమే దీంతో ముడిపడి ఉంది.

అసలు మాకున్న అస్పష్టమైన వ్యవస్థల్లో సాక్షాత్తూ మా రాచరికం కూడా ఒకటి. బహుశా పెకింగ్ నగరంలో, రాజప్రాసాదం పరిసరాల్లో ఈ విషయమై కాస్త స్పష్టత ఉండొచ్చేమో, అందులో కూడా వాస్తవం కన్నా భ్రమల పాళ్లే ఎక్కువ. ఉన్నతస్థాయి విద్యాలయాల్లో రాజనీతిశాస్త్రం, చరిత్ర బోధించే ఉపాధ్యాయులు తమకు స్పష్టమైన అవగాహన ఉందనీ, దాన్ని విద్యార్థులకు ధారపోయగలమనీ నమ్మబలుకుతారు. అలాగే కిందిస్థాయి విద్యాలయాల్లోకి ఒక్కో మెట్టూ దిగే కొద్దీ అక్కడి ఉపాధ్యాయులూ విద్యార్థులూ తమ అవగాహన పట్ల చాలా ధీమాగా ఉండటం గమనించవచ్చు, కానీ అక్కడ మిగిలిందల్లా వందలేళ్లుగా ప్రజల మనసుల్లోకి నాటబడిన కొన్ని సూత్రాల చుట్టూ ఆకాశాన్నంటుతూ పేరుకుపోయిన డొల్ల విద్యే, ఆ సూత్రాల్లోని మూలసత్యం ఏమీ చెడలేదు, కానీ దాన్ని గుర్తించలేనంతగా చుట్టూ అయోమయపు పొగమంచు కమ్మేసింది.

కానీ నిజానికి ఈ రాచరికానికి సంబంధించిన ప్రశ్నను ఎవరినైనా అడగాలంటే ముందు అది సామాన్య ప్రజలనే అడగాలి, ఆ వ్యవస్థ అంతిమంగా ఆధారపడేది ప్రజల మీదే కదా. ఐతే ఇక్కడ ఒకటి ఒప్పుకుని తీరాలి, నేను నికరంగా ఏమైనా మాట్లాడగలిగేది నా స్వస్థలం గురించే. అక్కడ, ఏడాది మొత్తాన్నీ అందమైన వైవిధ్యంతో నింపివేసే ప్రకృతిదేవతల క్రతువుల్నీ మినహాయిస్తే, మేం అనునిత్యం ఆలోచించేది ఒక్క రాజు గురించే. కానీ వర్తమానంలో ఉన్న రాజు గురించి కాదు; ఎందుకంటే అతను ఎవరో ఏమిటో మాకు స్పష్టంగా తెలిస్తే కదా. మేం ఈ విషయమై ఏ సమాచారం దొరుకుతుందా అని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నా – ఈ ఒక్క విషయమే మాకు ఆసక్తి కలిగించేది – చిత్రంగా ఏ సమాచారమూ దొరకదు, దేశమంతా విస్తారంగా ప్రయాణించిన యాత్రీకుల నుంచి కానీండి, ఇరుగు పొరుగు ఊళ్ల నుంచి కానీండి, లేదా కేవలం మా దరిదాపుల్లోని కాలవలే గాక పవిత్ర నదులెన్నింటి మీదో ప్రయాణం చేసిన నావికుల నుంచి కానీండి, చాలా విషయాలైతే తెలుస్తాయి, కానీ ఖచ్చితంగా ఏదీ నిర్థారణ కాదు.

 మా దేశం ఎంత విస్తారమైందంటే ఏ పోలికా దానికి న్యాయం చేయలేదు, స్వర్గాలు కూడా దాని వైశాల్యం ముందు చిన్నబోతాయి – అందులో పెకింగ్ నగరం ఒక చిన్న చుక్క లాంటిది మాత్రమే, అందులో రాజప్రాసాదం ఇంకా చిన్న చుక్క. అవటానికైతే రాజపదవి ప్రపంచంలోని అధికార శ్రేణులన్నింటిలోకీ గొప్పదని ఒప్పుకోక తప్పదు. కానీ ప్రస్తుతం ఉన్న రాజు, మాలాంటి ఒక మనిషి, మాలాగే దివాను మీద నడుం వాలుస్తాడు, అది విశాలంగా ఉండొచ్చు లేదా చాలా ఇరుకైనదీ పొట్టిదీ కూడా కావొచ్చు. మాలాగే ఒక్కోసారి అతను బద్దకంగా వళ్లు విరుచుకుంటాడు, బాగా అలిసిపోతే తన సన్ననైన నోటితో గట్టిగా ఆవలిస్తాడు. అంతకన్నా అతని గురించి ఏం తెలుసుకోగలం – ఇక్కడ వేల మైళ్లకు ఇవతల దక్షిణాన దాదాపు టిబెటన్ పర్వతాలకు దగ్గర్లో ఉన్న వాళ్లం. ఒక వేళ ఏ వార్తన్నా వచ్చినా అది అలలుగా మా దాకా చేరే సరికి ఆలస్యమైపోతుంది, ఎందుకూ పనికిరాకుండా పోతుంది. గొప్ప మేధావులూ, కానీ దుర్భుద్దిపరులూ ఐన కులీనులూ సభికులూ ఎల్లవేళలా రాజు చుట్టూ గుమికూడి ఉంటారు – స్నేహితులనీ సేవకులనీ ముసుగులు వేసుకుని శత్రుత్వంతో కుత్సితత్వంతో ఉంటారు – వాళ్లు రాజ్యాధికారానికి ప్రత్యామ్నాయశక్తులుగా పని చేస్తూ తమ విషం పూసిన బాణాలతో రాజుని గద్దె దింపటానికి అనునిత్యం శ్రమిస్తూంటారు. రాజ్యానికి అంతం లేదు, కానీ రాజు మాత్రం గద్దె నుంచి తడబడి కిందపడుతూనే ఉంటాడు, అవును, వంశాలకు వంశాలే నేలరాలి తమ ఆఖరి శ్వాసను మట్టిలోకి విడుస్తాయి. ఈ సంఘర్షణల గురించీ, యాతనల గురించీ ప్రజలకు ఎప్పటికీ తెలియదు; నగరానికి కొత్తగా వచ్చిన వాళ్లలాగా ప్రజలు బాగా కిక్కిరిసిన ఏ వీధి చివరనో ప్రశాంతంగా నిలబడి వెంటతెచ్చుకున్న చద్దిమూటలు విప్పితింటుంటే, అదే వీధికి ఎగువన చాలా దూరంలో నగరం నడిబొడ్డున ఉన్న సంతలో వాళ్ల రాజుని ఉరితీసే కార్యక్రమం సాగుతూంటుంది.

ఈ పరిస్థితిని ఒక పిట్టకథ బాగా వర్ణిస్తుంది: దాని ప్రకారం రాజు నీకోసం ఒక సందేశం పంపాడు, నీలాంటి అల్ప జీవి కోసం, రాచరికపు సూర్యునికి దూరంగా పోయి దాక్కున్న ఒక నిరర్థక నీడ కోసం; రాజు తన మరణశయ్య మీంచి కేవలం నీకోసమే ఒక సందేశం పంపాడు. అందుకోసం తన వార్తాహరుణ్ణి మంచం పక్కన మోకరిల్లమని ఆదేశించాడు; ఆ సందేశానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, దాన్ని మళ్లా తిరిగి తన చెవిలో చెప్పించుకున్నాడు. తాను విన్నది సరిగ్గానే ఉందని తలాడించాడు. అవును, తన చివరి క్షణాల్లో చుట్టూ గుమికూడిన వీక్షకుల సాక్షిగా – వారి కోసం అడ్డుగా ఉన్న గోడలన్నీ కూల్చివేయబడ్డాయి, ఆ రాజ్యపు సామంతరాజులెందరో ఎత్తుగా విశాలంగా పైకి లేచిన మెట్ల మీద నిలబడి చూస్తున్నారు – వీరందరి ముందు రాజు తన సందేశాన్ని నీకు పంపాడు. వార్తాహరుడు తక్షణమే బయల్దేరాడు; బలిష్టమైన అలుపులేని మనిషతను; అటు కుడి చేత్తోనూ ఇటు ఎడం చేత్తోనూ గుంపు మధ్య నుంచి దారి తొలుచుకుంటూ ముందుకుసాగాడు; ఎవరైనా అడ్డువస్తే చూపుడు వేలితో తన ఛాతీ వైపు చూపిస్తున్నాడు, అక్కడ ఒక సూర్యపతకం మెరుస్తోంది; వేరే ఏ మనిషికీ వీలుకానంతగా అతనికి దారి సుగమం అవుతోంది. కానీ ఆ సమూహానికి అంతం లేదు; ఎంతకీ తెగదు. ఒక్కసారి శివార్లలోని పచ్చికబయళ్ల దాకా చేరగలిగితే చాలు ఎంత వేగంగానైనా పరిగెత్తవచ్చు; త్వరలోనే నీ తలుపు మీద అతని చేతి వేళ్ల సంగీతం వినపడుతుంది. కానీ దానికి బదులు ఆ సమూహం మధ్య అతను నిష్పలంగా తన శక్తినంతా అవజేసుకుంటున్నాడు. ఇంతాజేసి ఇంకా రాజప్రాసాదపు లోలోపలి గృహాల్లోనే పెనుగులాడుతున్నాడు; ఆ సమూహం అంచుకు ఎప్పటికీ చేరుకోలేడు; ఒకవేళ చేరుకున్నా లాభం లేదు; ఆ తర్వాత సభా భవనాలు దాటాలి; సభాభవనాల తర్వాత రెండో రాజప్రాసాదం దాటాలి; ఆ తర్వాత మళ్లా మెట్లుంటాయి, మళ్లా సభాభవనాలు ఎదురవుతాయి; ఆ తర్వాత ఇంకో ప్రాసాదం; అలాగే వేలసంవత్సరాలు గడిచిపోతాయి; ఒకవేళ ఎట్టకేలకు ఎలాగో ఆఖరు సింహద్వారాన్ని పెల్లగించుకుని బయటపడినా – అది జరగటం దాదాపు అసంభవమనుకో – అతనికి ఎదురుగా రాజధాని పరుచుకుని ఉంటుంది, ప్రపంచానికే కేంద్రమైన రాజధాని, బద్దలయ్యేంతగా కిక్కిరిసిపోతూ పాకిపోయిన రాజధాని. ఒక చనిపోయిన వ్యక్తి పంపిన సందేశం తీసుకుని ఎవ్వరూ దాన్ని దాటలేరు. కానీ నువ్వు మాత్రం చీకట్లు పడుతుండగా నీ కిటికీ దగ్గర కూర్చుని ఆ సందేశం గురించి కలలు కంటావు.

మా ప్రజలు రాజు గురించి ఆలోచించటం అచ్చం ఇలాగే ఇంత ఆశారహితంగానూ ఇంత ఆశావహంగానూ ఉంటుంది. వాళ్లకు ఏ రాజు దిగిపోతున్నాడో తెలియదు, అసలు పాలిస్తున్న రాజవంశం పేరు విషయంలో కూడా అనుమానాలుంటాయి. పాఠశాలల్లో రాజవంశాల గురించీ వారసత్వక్రమం గురించీ తేదీలతో సహా చాలా బోధిస్తారు, అయినా ఎంత అనిశ్చితి వ్యాపించి ఉందంటే పెద్ద పెద్ద పండితులు కూడా ఈ విషయం మీద తర్జనభర్జనలు పడుతూనే ఉంటారు. మా ఊళ్లలో ఎప్పుడో చచ్చిపోయిన రాజులు సింహాసనాలధిరోహిస్తారు, కేవలం మా పాటల్లోనే బతికున్నాడనుకున్న ఇంకొకడు ఇటీవలే ఆస్థాన పూజారి ద్వారా ప్రకటన జారీచేస్తాడు. ఎప్పుడో చరిత్రలో కలిసిపోయిన యుద్ధాలు మాకు కొత్తవి, ఆ కబురు చెప్పటానికి పొరుగింటి ఆసామీ ఆత్రంగా పరిగెత్తుకొస్తాడు. వంచకులైన రాజోద్యోగుల మాయలో పడి దారి తప్పిన రాజుల భార్యలు అధికార దాహంతో, తీవ్రమైన లోభంతో, కట్టలుతెంచుకున్న కామంతో, తమ దుష్కృత్యాలు ప్రతీసారి కొత్తగా చేస్తూనే ఉంటారు. వాళ్లు కాలంలో గతించిపోయే కొద్దీ వాళ్ల కార్యాలు సరికొత్త రంగులద్దబడి మా ముందుకొస్తాయి. ఎప్పుడో వేల ఏళ్ల క్రితం ఒక రాణి తన భర్త రక్తం తాగి చంపేసిన సంగతిని కొత్తగా తెలుసుకుని మా పల్లె బిగ్గరగా గగ్గోలు పెడుతుంది.

అలా మా ప్రజలు చనిపోయిన రాజుల్ని బతికున్నట్టు పరిగణిస్తారు, బతికున్న పాలకుల్ని చనిపోయాడనుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా, అంటే మొత్తం మనిషి జీవితకాలంలో ఎప్పుడో ఒక్కసారి, ఒక రాజాధికారి పల్లెటూళ్లమ్మటా పర్యటన చేస్తూ మా పల్లెకి వచ్చి, ప్రభుత్వం తరపున కొన్ని ప్రకటనలు చేసి, మా పన్నుల జాబితాల్ని తనిఖీ చేసి, పాఠశాల విద్యార్థుల్ని పరీక్షించి, ఇక్కడి పరిస్థితుల గురించి మా ఊరి పూజారినడిగి తెలుసుకుని, తర్వాత, ఇక తన పల్లకీ ఎక్కి వెళ్లిపోబోయే ముందు, హాజరైన ప్రజలందరి ఎదుటా నిలబడి ఈ పర్యటనలో తనకు కలిగిన భావాల్ని గంభీరమైన భాషలో మందలింపుగా ఏకరువుపెడుతున్నప్పుడు – అప్పుడు మా అందరి ముఖాల మీదుగా ఒక చిన్న నవ్వు పాకిపోతుంది, జనం ఒకరివైపొకరు ఓరచూపులు చూసుకుంటారు, అధికారి ఎక్కడ గమనిస్తాడోనని పిల్లల వైపు వంగుతారు. వాళ్లనుకుంటారు, ఎందుకు ఈ అధికారి ఒక చనిపోయిన మనిషి గురించి బతికున్నట్టు మాట్లాడుతున్నాడు, అతనంటున్న రాజు ఎప్పుడో చచ్చిపోయాడు, ఆ రాజవంశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఈ అధికారి ఊరికే మాతో పరాచికాలాడుతున్నాడు, కానీ మనం అదేం గమనించనట్టుగానే నడుచుకుందాం, లేదంటే ఆయన్ని కించపరిచినట్టవుతుంది. కానీ మనం మాత్రం మన ప్రస్తుత పాలకునికే విధేయులమై ఉందాం, అలావుండకపోతే అది నేరం అవుతుంది. అలాగ, ఆ అధికారి పల్లకీ కదిలివెళిపోగానే, ఎప్పుడో మట్టిలో కలిసిపోయిన బూడిదలోంచి ఒక మూర్తి మా పల్లెకు పాలకునిగా పైకి లేస్తాడు.

అలాగే దేశంలో రేగుతున్న తిరుగుబాట్లూ లేదా సమకాలీన యుద్ధాలూ మా ప్రజలకు ఎంతమాత్రం పట్టవు. నేను వయసులో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది. మా పొరుగుదే ఐనా చాలా దూరంలో ఉన్న ఒక తాలూకాలో తిరుగుబాటు చెలరేగింది. దానికి కారణం ఏమిటన్నది నాకు అంతగా గుర్తులేదు, అదంత ముఖ్యం కూడా కాదు; అక్కడి ప్రజలు కాస్త ఉద్రిక్త స్వభావులు అవటం మూలాన తరచూ తిరుగుబాట్లు చెలరేగుతూనే ఉంటాయి. సరే విషయానికొస్తే, ఒక రోజు మా తాలూకాలోంచి వెళ్తూన్న ఒక బిచ్చగాడు నా తండ్రి దగ్గరకు వచ్చి తిరుగుబాటుదారులు ప్రచురించిన కరపత్రం ఒకటి ఇచ్చాడు. ఆ రోజు ఏదో వేడుక కావటంతో మా ఇంటి గదులన్నీ అతిథులతో నిండిపోయి ఉన్నాయి, అందరికీ మధ్యలో కూర్చుని పూజారి ఆ పత్రాన్ని పరిశీలించాడు. హఠాత్తుగా అందరూ నవ్వటం మొదలుపెట్టారు, ఆ గందరగోళంలో ఆ పత్రం ఎవరో చింపేశారు, అప్పటికే చాలా బిక్ష దండుకున్న ఆ బిచ్చగాణ్ణి గుద్దులతో తన్నులతో బయటకు నెట్టేశారు, తర్వాత బయట అందమైన వాతావరణాన్ని ఆస్వాదించటానికి అతిథులంతా నిష్క్రమించారు. ఎందుకు? ఆ పొరుగు తాలూకా వాళ్ల యాస కొన్ని అంశాల్లో మా యాసకు చాలా భిన్నంగా ఉంటుంది, ఈ వ్యత్యాసం వాళ్లు రాసే పద్ధతిలో కూడా వ్యక్తమవుతుంది, అది మాకు కాస్త ప్రాచీన భాషలా అనిపిస్తుంది. పూజారి రెండు పేజీలు చదివాడో లేదో మేం ఒక తీర్మానానికి వచ్చేశాం. అదంతా పాత చరిత్ర, ఆ గాయాలు మానిపోయి చాలా కాలమైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ కరపత్రంలోని మాటల్లో అప్పటి వర్తమానపు భయానక పరిస్థితులు విబేధించలేని విధంగా వెల్లడైనా, మేం మాత్రం తలలు అడ్డంగా ఆడిస్తూ వెక్కిరింతగా నవ్వుతూ వినటానికి నిరాకరించాం. వర్తమానాన్ని చెరిపేయటానికి అంత సిద్ధంగా ఉంటారు మాప్రజలు.

ఇలాంటి పరిస్థితుల ఆధారంగా ఒకవేళ ఎవరైనా అసలు మాకు ఒక రాజనేవాడే లేడన్న తీర్మానానికొస్తే, అది మరీ వాస్తవదూరమేం కాదనే చెప్పాలి. ఒకటి మాత్రం వక్కాణించి చెప్తాను: మా దక్షిణాది ప్రజల్ని మించి రాజుకు విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్లు బహుశా ఇంకెవరూ ఉండరు, కానీ మా విశ్వాసం వల్ల అతనికి ఏ లాభమూ లేదు. నిజమే, మా ఊరి పొలిమేరల్లో ఒక స్తంభంపై పవిత్రమైన డ్రాగను నిలబడి ఉంటుంది, అది మానవాళి మేల్కొన్న కాలం నుంచీ తన అగ్ని ఊపిరులను నివాళిసూచకంగా పెకింగ్ నగరం వైపు నిశ్వసిస్తూనే ఉంది – కానీ సాక్షాత్తూ ఆ పెకింగ్ నగరమే మాకు ఇంకో గ్రహం కన్నా అపరిచితమైంది. అసలు అలాంటి ఊరు ఉండటం సంభవమేనా? అసలు ఇళ్లు ఒకదాని పక్కన ఇంకొకటి ఉండటం, అవన్నీ కలిసి మా కొండ మీంచి చూస్తే ఎంత మేర కనపడుతుందో అంతకుమించి విస్తరించి ఉండటం సంభవమేనా, ఆ ఇళ్ల మధ్య పగలూ రాత్రన్న తేడాలేకుండా మనుషులు కిక్కిరిసి మసలుకోవటం సాధ్యమేనా? ఇలాంటి నగరం ఉందని నమ్మడం కంటే, ఆ పెకింగూ రాజూ ఒక్కరేననీ వాళ్లు యుగాల పర్యంతం సూర్యుని కింద మందకొడిగా తేలుతూ పోయే మబ్బుశకల్లాంటివారనీ చెప్తే నమ్మడం ఇంకా సులువు.

ఇలాంటి నమ్మకాల ఫలితంగా దక్కే జీవితం మొత్తం మీద చూస్తే స్వేచ్ఛకలదీ హద్దుల్లేనిదీను. అలాగని అనైతికం మాత్రం కాదు; నా ఊళ్ళో నేను గమనించినంతటి స్వచ్ఛమైన నీతినియమాలు నాకు నా ప్రయాణాల్లో ఇంకెక్కడా తారసపడలేదు. కానీ అది సమకాలీన చట్టాలకు బద్ధం కాని జీవితం, పాతకాలం నుంచీ సంక్రమించిన బలప్రయోగ దమనకాండ పద్ధతుల ప్రకారం నడుచుకునే జీవితం.

అలాగని మా తాలూకాలో ఉన్న పదివేల పల్లెటూళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పను, మా దేశంలో ఉన్న ఐదువందల తాలూకాల్లోనూ ఇంతేనని అసలే చెప్పను. కానీ ఈ విషయమైన నేను చదివిన ఎన్నో రచనల ఆధారంగా, నా స్వీయపరిశీలన ఆధారంగా – ముఖ్యంగా గోడ నిర్మాణం భారీ మానవ వనరులతో ముడిపడింది కావటం మూలాన సునిశితమైన పరిశీలకునికి అక్కడ దాదాపు అన్ని తాలూకాల నుండి వచ్చే మనుషుల మనస్తత్వాల్నీ గ్రహించే వీలు ఉంటుంది – వీటన్నింటి ఆధారంగా, నేను చెప్పగలిగేదేమిటంటే, రాజు పట్ల మా ఊళ్లో ఉన్న ధోరణే దాదాపు అన్ని చోట్లా వ్యాపించి ఉంది. అలాగని ఈ ధోరణిని ఒక సుగుణంగా ఎంచి చెప్పటం లేదు; సుగుణం కానే కాదు. నిజమే, ఒకరకంగా దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, భూమ్మీదే అత్యంత ప్రాచీనమైన రాజ్యంలో పాలన సాగిస్తూ కూడా అది తన పాలితప్రాంతంలోని మూలమూలలకీ చేరుకునేలా తన అధికారాన్ని అభివృద్ధి చేసుకోవటంలో విఫలమైంది, లేదా అభివృద్ధి చేసుకోవటంలో నిర్లక్ష్యం వహించింది. కానీ మరోలా చూస్తే, ఇటుపక్క ప్రజల్లో కూడా కాస్త నమ్మకలోపమూ, ఊహాశక్తి లోపమూ కన్పిస్తాయి, వాటి కారణంగానే వాళ్లు పెకింగ్ నగరంలోని రాజరికాన్ని జడత్వం నుంచి మేల్కొలిపి దాన్ని ఒక సజీవమైన ప్రత్యక్షమైన వాస్తవంగా తమ హృదయాలకు హత్తుకోలేకపోయారు, ఇప్పటికీ ఆ రాజరికం కోరుకునేదల్లా ఒక్కసారి ఆ హృదయస్పర్శను అనుభవించి గతించిపోవటమే.

కాబట్టి ఈ ధోరణి ఖచ్చితంగా సుగుణం కాదు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోపాలే మా ప్రజల్ని ఒక్కతాటిపై నిలిపే అతిపెద్ద ప్రభావాలు కూడా; మేం నిలబడిన కాళ్ల కింద నేల కూడా ఇవే అని చెప్పే ధైర్యం చేస్తాను. ఇలాంటప్పుడు ఎక్కడ లోపం ఉందో వెతికి నిర్థారించి చెప్పటమంటే, మా ఆత్మనిబ్బరాన్ని కూలదోయటమే కాదు, అంతకన్నా తీవ్రంగా, మా కాళ్ల కింద నేలని కుదిపేయటమే. ఈ కారణంతోనే ప్రస్తుతానికి ఈ ప్రశ్నల విషయమై ఇంకా ముందుకు వెళ్లి పరిశోధన సాగించటం నాకు ఇష్టం లేదు.

*


[1] బేబెల్ బురుజు (టవర్ ఆఫ్ బేబెల్): బైబిల్ కథ ప్రకారం, మహాప్రళయం తర్వాత మిగిలిన కొందరు మనుషులు బొందితో స్వర్గానికి చేరుకోవాలన్న యావతో భూమ్మీంచి ఆకాశంలోకి ఒక బురుజు నిర్మించటం మొదలుపెట్టారు; దేవుడు ఈ ప్రయత్నాలకు కోపించి, వాటిని భంగపరచటానికి వాళ్ళ భాషల్లో అయోమయం సృష్టించాడు, ఒకరినొకరు అర్థం చేసుకునే వీల్లేకుండా చేశాడు, దాంతో వీళ్ళంతా వేర్వేరు భాషలు గల వాళ్ళుగా భూమ్మీద చెల్లాచెదురయ్యారు, వీళ్ళ ప్రయత్నాలకు గండి పడింది, బురుజు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ‘బేబెల్’ అనే పదానికి గ్రీకు అర్థం ‘దేవుని ద్వారం’; హిబ్రూ అర్థం ‘అయోమయపరచటం’.
===

(కినిగె పత్రికలో ప్రచురితం)