February 24, 2017

కన్నగాడి నాన్న

షాపు తెరిచి మిషను తొక్కుకుంటున్న సూర్రావుకి గుడిమెట్లోడు వచ్చి చెప్తేనే తప్ప తెలీలేదు- ఆ రోజు జానిబాబుని పెళ్లికొడుకుని చేస్తున్నారన్న సంగతి. మామూలుగానైతే గుడిమెట్లోడు లుంగీ ఎగ్గొట్టుకుంటూ వచ్చి ఎంత సోది చెప్పినా సూర్రావు పని ఆపడు. తలెత్తకుండా మిషను తొక్కుకుంటూనే నాలుగు మాటలకి ఓ మాట అంటాడు. జానిబాబు పెళ్లి మాట వచ్చినపుడు మాత్రం పని ఆపి గుడిమెట్లోడి వంక చూసాడు.

గుడిమెట్లోడు సూర్రావు వాలకం చూసి, “ఏఁ నిన్ను పిల్లేదేటీ కిట్నగారు పెళ్లికీ?” అన్నాడు.

సూర్రావు మళ్ళీ తలొంచుకుని సూది కింద చొక్కా అంచుని సర్దుతూ, “నన్నెందుకు పిలాలీ, నేనేవఁన్నా ఆళ్ల చుట్టాన్నేటీ?” అన్నాడు.

“అదేటయ్యా... ఇపుడంటే కిట్నగారు బాగా సంపాయించి సెంటరు కాడ ఇల్లు కట్టేడు గానీ, ఇదొరకూ మీరూ మీరూ ఒక యీదోళ్లే కదా. ఎదురెదురు కొంపలు పైగానీ!” అన్నాడు గుడిమెట్లోడు.

సూర్రావు ఏం మాట్లాడ లేదు. అతని కళ్ల ముందు జానిబాబు పెళ్లికొడుకు లాగా గుర్తుకొచ్చాడు. దాంతోపాటే చనిపోయిన కొడుకు కూడా గుర్తుకొచ్చాడు. ఈపాటికి కన్నగాడికీ పాతికేళ్లు వచ్చుండేవి. ఏదో ఒక సంబంధం చూసి చేసేద్దుడు. ఇప్పుడంటే ఆ ఇల్లు లేదుగానీ, ఉండుంటే పక్కన రెండు గదుల్లోనీ కాపరం పెట్టించేద్దుడు. అసలు కన్నగాడుంటే దాన్ని అమ్మనిచ్చేవోడా. చెల్లి పెళ్లి వాడే దగ్గరుండి చేసేవాడు కాదూ. అల్లుడు ఇప్పుడు లోకువ కట్టినట్టు కడితే ఊరుకునేవాడా....

గుడిమెట్లోడికి కాసేపటికి అనిపించింది- తనకి తనే మాట్లాడుకుంటున్నాడని. సూర్రావు మిషను దగ్గరి నుంచి లేచి దండెం మీది చొక్కా తొడుక్కోవటంలో ఉన్నాడు.

“ఏంటి పన్నెండయినా అవలేదు షట్టరు దించేత్తన్నావ్?”

సూర్రావు మాట్లాడకుండా బొత్తాలు పెట్టుకుంటున్నాడు.

“ఏటప్పుడే వైను షాపు కాడికా? మీ యావిడికి తెలియాలి, సీపిరికట్ట ఇరగ్గొట్టేద్ది ఈపు మీద....”

“లే ఎహె పనికి మాలినెదవా!” అని గుడిమెట్లోడ్ని అదిలించి లేపి, అతను కూర్చున్న బల్లని లోపల పెట్టేసి మడతల తలుపు దగ్గిరికి లాగాడు సూర్రావు.

“నీ అయ్యా నిన్ను నమ్మి ఇంకా బట్టలిత్తన్నారు చూడు కుట్టమని, ఆళ్లననాలి,” అంటూ గుడిమెట్లోడు లుంగీ దులుపుకుని రోడ్డు మీదికి వెళ్లిపోయాడు, తన కబుర్లు వినేవాడు ఇంకొకడ్ని వెతుక్కుంటూ.

అందరూ ఎవరిపనుల్లో వాళ్లుండి ఈ మధ్యాహ్నం వేళ వీధంతా ఖాళీగా ఉంది. సూర్రావు కొడుకుని తలుచుకుంటూ పరాకుగా ఇంటివైపు నడిచాడు. రాన్రానూ అతని మనసులో కన్నగాడి గుర్తులన్నీ అలుక్కుపోతున్నాయి. పదే పదే తల్చుకోవటం వల్ల బండబారిపోతున్నాయి. ఊరికే చీకట్లో బొమ్మల్లా కళ్ల ముందుకొచ్చి ఏమీ అనిపించకుండానే వెళిపోతున్నాయి. దానికి తోడు, భార్య జరిగినవాటికి చిలువలు పలువలు కల్పించి జ్ఞాపకాల్ని కల్తీ చేస్తుంది. వెలిసిపోయే జ్ఞాపకాల మధ్యలో కన్నగాడి రూపం ఆనవాలు తప్పిపోకుండా కాచుకునేందుకు సూర్రావుకు మిగిలిన ఆసరా అల్లా మూడే మూడు ఫోటోలు. ఒకటి ఏడోతరగతికి స్కూల్లో తీయించుకున్న పాస్‌పోర్టు ఫొటో, రెండోది చుట్టాలెవరిదో పెళ్లి ఫొటోల ఆల్బంలో కనపడితే వాళ్లని అడిగి తెచ్చుకున్న ఫొటో, మూడోది వాడపల్లి తీర్థానికి వెళ్ళినప్పుడు స్టూడియోలో తీయించుకున్న ఫొటో. ఈ ఫొటోలో కన్నగాడు సూర్రావు ముచ్చటపడి కుట్టించిన పొట్టి ఫేంటు వేసుకుని, టక్ చేసుకుని, జేబులో చేతులు పెట్టుకుని చూస్తుంటాడు. ఆ వయసుకే పేద్ద ఫోజు! వాళ్ల నాన్నకీ అమ్మకీ కొడుకు కాదన్నట్టు వాళ్ళకు ఎడంగా నిలబడి సొంత ఫోజొకటి పెట్టుకున్నాడు. చిరంజీవిలా కనపడాలని ఫౌడరు పులిమిన ముఖంలో తెచ్చిపెట్టుకున్న కోపంతో చూస్తుంటాడు. చుట్టాల పెళ్లి ఆల్బమ్ నుంచి తెచ్చుకున్న ఫోటోలో అర్ధరాత్రి ముహూర్తానికి జరుగుతున్న పెళ్లిలో ఎవరి ఒళ్లోనో నోరు తెరిచి నిద్రకు జోగుతుంటాడు. బళ్లో తీసిన పాస్‌పోర్టు ఫోటోలో నూనె జిడ్డు ముఖంతో ఉంటాడు. ఆ ఫొటోలో కన్నగాడి చెంపల మీద నుంచి స్కూలు స్టాంపుని కొట్టిన మనిషెవరో తెలీదుకానీ సూర్రావు ఆ మనిషిని చాలాసార్లు తిట్టుకున్నాడు. కానీ ఈ ఫోటోలు వేటిల్లోనీ కన్నగాడిలో ఎంతో బాగుండే నవ్వు ఉండదు.

సూర్రావు సంత దాకా వచ్చాక బడ్డీకొట్టు దగ్గర ఆగి సిగరెట్టు కొనుక్కున్నాడు. దాన్ని వెలిగించుకుని అలా బజారు షెడ్ల వైపు వెళ్లాడు. ఆ రోజు సంత లేదు. షెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నేల మీద కుళ్ళిన కూరగాయలూ, మొండి అరటి గెలలూ, ఉల్లిపొరలూ. ఓ ఇనప స్తంభానికి జారగిలి కూర్చున్నాడు. ఇంటికి వెళ్లాలనిపించలేదు. వెళ్తే భార్య షాపు ఎందుకు కట్టేసావని అడుగుతుంది. ఎందుకో చెప్పాలి. ఆళ్లెవరిదో పెళ్లయితే నీకెందుకు బాధ అంటుంది. ఎందుకో దానికి తెలుసు. కన్నగాడూ, జానిబాబూ ఒకే క్లాసు. ఎనిమిదో తరగతిలో ఓ రోజు బడి ఎగ్గొట్టి కపిలేశ్వరపురం గోదావరి స్నానాలకి వెళ్ళారు. ఆటల ధ్యాసలో ఒడ్డుకి దూరం జరిగితే ఇద్దర్నీ వరద లాగేసింది. కన్నగాడు చచ్చిపోయాడు, అక్కడున్న పల్లోళ్లు జానిబాబుని మాత్రం బయటికి లాగగలిగేరు. ఇదంతా సూర్రావు భార్యకి తెలీక కాదు. కన్నగాడు పోయిన తర్వాత ఆమె కూడా జానిబాబుని చూసినపుడల్లా ఏడ్చేది. ఆ కుర్రాడు మరి భయపడ్డాడో, లేదంటే ఎందుకు పాపం అస్తమానం కంటపడి ఆమెను ఏడిపించటం అనుకున్నాడో- ఇంటికి రావటం మానేశాడు. అయినా ఆమెకి భ్రమ తీరలేదు. మరుసటి ఏడాది కన్నగాడి పుట్టిన రోజుకి “బట్టలు కుట్టిపెట్టు జానిబాబుకి ఇద్దాం” అన్నది. సూర్రావు అది పద్ధతి కాదని తిట్టాడు. అయినా అప్పటికి ఊరుకుంది గానీ, జానిబాబు పుట్టిన రోజు వచ్చే దాకా ఆగి కొత్తబట్టలు తీసుకెళ్లి వాళ్ల ఇంట్లో ఇచ్చింది. కృష్ణగారాళ్లావిడ మొదట వద్దన్నదే తర్వాత కృష్ణగారు ఫర్లేదు తీసుకొమ్మంటే తీసుకుంది. కానీ దీని దరిద్రానికి, ఓ వారం తర్వాత ఆ కుర్రాడికి జ్వరం పట్టుకుంది. అది జడుపు జ్వరమని చెప్పి ఆ రోజు కృష్ణగారాళ్లావిడ తిట్టిన తిట్లు వీధివీధంతా వినపడ్డాయి.

జానిబాబు కళ్ల ముందే ఎదిగాడు. ఆ అబ్బాయి పది పాసయ్యేదాకా కృష్ణంరాజు గారు అదే వీధిలో ఉన్నారు. తర్వాత ఆయనకి వ్యాపారంలో కలిసొచ్చింది. ఒక డీసీఎం నడిపేవాడల్లా, ఇంకో రెండు డీసీఎంలూ, ఒక లారీ కొన్నాడు. మండపేటలో ఆఫీసు కూడా తెరిచాడు. ఊళ్లో సెంటరు దగ్గర డాబా ఇల్లు కట్టించుకుని, ఈ వీధిలో ఉన్న ఇంటిని అద్దెకిచ్చేసాడు. ఆ తర్వాత జానిబాబు సూర్రావుకి కనిపించింది తక్కువే. ఎపుడో కాలేజీలో సూర్రావు కూతుర్ని ఎవరో ఏడిపిస్తే వాడి మీదకి కొట్టడానికెళ్ళేడట. కూతురే ఇంటికొచ్చి చెప్పింది. తర్వాత ఎపుడో ఒకసారి చదువైపోయాకా షాపు దగ్గరికి వచ్చి, “హైదరాబాదులో ఉద్యోగానికి వెళ్తున్నానంకుల్” అని చెప్పాడు. అలా చెప్పాలనిపించినందుకు సూర్రావుకి ఆ కుర్రోడి మీద ఎంతో మమకారం కలిగింది. జేబులో ఓ మూడొందలుంటే తీసి ఏవన్నా ఖర్చులకు ఉంచుకొమ్మని ఇచ్చి పంపాడు. ఆ తర్వాత జానిబాబు ఎపుడు ఊరొచ్చేవాడో, ఎపుడు హైదరాబాదు వెళ్లిపోయేవాడో సూర్రావుకి తెలిసేది కాదు. అతనికి జీవితం మీద శ్రద్ధ పోయింది. తాగుడు మరిగి షాపు ఇష్టం వచ్చినప్పుడు తెరిచేవాడు. ఒకవేళ తెరిచినా గానీ అతను కుట్టే ‘అల్లుడుగారు’, ‘గ్యాంగ్ లీడరు’ స్టయిలు చొక్కాలకీ పంట్లాములకీ గిరాకీ లేక, అతన్నే అంటిపెట్టుకున్న కొద్దిమంది తప్పితే కొత్త బేరాలేవీ వచ్చేవి కాదు. ఎలాగో ఇల్లమ్మి కూతురు పెళ్లయితే చేసి పంపగలిగేడు.

భార్య కన్నగాడిని తలుచుకుని ఏడిచినపుడల్లా సూర్రావుకి చిరాకు కలిగేది. కొడుకు చావు ఆమెలో ఏ మార్పూ తేవకపోవటం, ఆమె తాపత్రయాలూ రాగద్వేషాలూ అన్నీ పూర్వంలాగే ఉండటం చూసి సూర్రావుకి ఆమె దిగులంతా పైపైనే అనిపించేది. అతడ్ని లోపలి నుంచీ తినేసి భవిష్యత్తుపైన నీడలు వాల్చిన దిగులుకూ, భార్య అందరితోనూ కన్నీటి పర్యంతమై చవగ్గా పంచుకునే దిగులుకూ మధ్య ఉన్న తేడాయే అతడ్ని భార్యకు దూరం చేసింది. ఆమె దగ్గర కన్నగాడి ఊసెప్పుడూ ఎత్తేవాడు కాదు. ఇప్పుడు కూడా ఈ స్థితిలో ఇంటికి వెళ్ళి దానికి ఎదురుపడి మాట్లాడాలనీ, అది తీసే ఆరాలకి జవాబులు చెప్పాలనీ లేదు. చెప్పినా అర్థం కాదు. పైగా అదొదిలేసి- కృష్ణగారాళ్లావిడతో ఉన్న గొడవలు గుర్తు తెచ్చుకోవటమో, వాళ్లు గొప్పోళ్ళయిపోయి కళ్ళు నెత్తికెక్కి పెళ్ళికి పిలవలేదని సణుక్కోవటమో చేస్తుంది.

సూర్రావు సిగరెట్టు పడేసిలేచి వచ్చినదారినే వెనక్కి నడవటం మొదలుపెట్టాడు. కన్నగాడు బతికుంటే తన జీవితం ఎలా వుండేదో అతను అపుడపుడూ ఊహించుకుంటూ ఉంటాడు. కూతురికి రూపంలో సూర్రావు పోలిక వచ్చింది కానీ గుణం మాత్రం తల్లే. కానీ కన్నగాడి రూపం తల్లిదే అయినా గుణం సూర్రావుదే. చదువు మీద అస్సలు శ్రద్ధ ఉండేది కాదు. ఏడో తరగతి ఎలాగో గట్టెక్కించాడు. వాడు బాగా చదువుకోవాలని సూర్రావుకి ఉండేది. వాడు మాత్రం వేసవి సెలవుల్లో నాన్న దగ్గర కుట్టుపనిలో సాయం చేయటానికే ఎక్కువ ఇష్టపడేవాడు. బతికుండుంటే తనకి పనిలో సాయంగా ఉండేవాడేమో. ఏముంది, సెంటరు లోనో, మండపేటలోనో ఇంకో షాపు పెట్టుకునుండేవాడు. ఇల్లు అమ్మే పని లేకుండానే చెల్లి పెళ్ళి చేసుండేవాడు. ఆళ్లమ్మ ఆపరేషనుకి అప్పుచేయాల్సిన పని లేకుండా సాయంగా ఉండేవాడు. సూర్రావు జీవితంలో ఓడిపోయిన, అవమానాలు పాలైన సన్నివేశాలని తలుచుకున్నాడు. ఆ సమయాల్లో తన పక్కన ఒక పెద్దరికం ఉట్టిపడే యువకుడి సమక్షాన్ని ఆసరాగా ఊహించుకున్నాడు.

గాంధీ బొమ్మ సెంటరుకి అవతలిపక్క వీధిలో కృష్ణగారి ఇల్లు. సూర్రావు వీధి మలుపు తిరిగేసరికి కృష్ణగారి ఇంటి ముందు పందిరి వేసి కనిపించింది. దానికి అవతల దారిని కప్పేసివున్న ఒక టెంటులో భోజనాల బల్లలు పరిచి ఉన్నాయి. ఇంకా వడ్డనలు మొదలు కాలేదు. ఎవరో కుర్రాళ్లు జానిబాబు ఫ్రెండ్స్ కాబోలు బల్లల దగ్గర అల్లరల్లరిగా మాట్లాడుకుంటున్నారు. గుమ్మం ముందున్న పందిరి కింద పంచెల్లోనీ, మడత నలగని ఖద్దరు చొక్కాల్లోనీ పెద్దాళ్లు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పందిరికి ఇవతల తూము దగ్గర ఒక కారు రంగురిబ్బన్లతో, ప్లాస్టిక్ పూలతో ముస్తాబై ఉంది. అద్దానికి ఓ పక్కన లవ్ గుర్తు మీద “జ్ఞానేష్ వెడ్స్ సుహాసిని” అనీ, బంపరు పైన థెర్మాకోలు అట్ట మీద “బలుసువారి పెళ్లి సందడి” అనీ రంగుల్లో పేర్లు ఉన్నాయి.

సూర్రావు కుర్చీల వెనక నుంచి ఇంటి వైపు నడిచాడు. అరుగు మెట్లెక్కి, కర్టెన్లు వేసున్న కటకటాల గదిలోకి వెళ్ళాడు. గుమ్మానికి ఎదురుగా కెమెరా స్టాండు ముందు ఫొటోగ్రాఫరు నిలబడి ఉన్నాడు. అతనికి అటూయిటూ కొంతమంది కుర్రాళ్లు సెల్‌ఫోనుల్లో ఫొటోలు తీస్తున్నారు. ఈ గుంపుకి ఎదురుగా, పళ్లేల్లో స్వీట్లూ పళ్లూ పెట్టివున్న టీపాయికి అవతల, షామియానా సప్లయిర్స్ వాళ్ళ వెండి రంగు డిజైన్లున్న ఎరుపు కుర్చీలో కూర్చుని ఉన్నాడు జానిబాబు. అతని మీద అక్షింతలు వేస్తూ ఫోటోలు దిగుతున్నారు చుట్టాలూ, ఊళ్లో దంపతులూ. ఆ వెనకాల గాగ్రా చోళీల్లోనూ, పట్టు చీరల్లోనూ అమ్మాయిలూ, ఆడవాళ్లూ సందడిగా తిరుగుతున్నారు. సూర్రావు ఓ క్షణం గడప మీంచి కాలు వెనక్కి తీసుకోబోయినవాడే మళ్లీ లోపలికి అడుగుపెట్టాడు. ఎవరూ అతడ్ని గమనించలేదు. కటకటాలకి ఆనుకుని నిలబడిన గుంపులో చేరాడు. ఆ గది అంతా ఆనందపు మాటలతో, నవ్వులతో, కెమెరా ప్లాష్ లతో ఉంది.  జానిబాబు అక్షింతల కింద నుంచి చూస్తూ, కొత్తగా కనిపిస్తున్న మీసకట్టు కింద నుంచి నవ్వుతున్నాడు.

సూర్రావు తన కొడుకుని అలాగే పెళ్లి బట్టల్లో ఊహించుకోవడానికి ప్రయత్నించాడు. అర్ధాంతరమైన మరణం వల్ల ఎప్పటికీ పసితనంతోనే మిగిలిపోయిన కన్నగాడిని తన ఊహలోనే వయసు పెరిగేట్టు చేసాడు. కన్నగాడి పెదాలపై పసి నూగుని గరుకు మీసంతో మార్చి, తెల్ల చొక్కా పంట్లామూ తొడిగి, నుదుటన పెళ్లి బొట్టు దిద్దబోయాడు. కానీ లోపలికళ్ల ముందుకొచ్చి కదలాడిన రూపం అతని కొడుకులా లేదు. అది కూడా పరకాయించే కొద్దీ దూరమై మసకగా మారి మాయమైపోయింది. ఆ ప్రయత్నం మానుకుని చిన్నప్పటి కన్నగాడినే పెళ్లి ముస్తాబులో ఊహించుకున్నాడు. బడి నుంచి పరుగుల పరుగుల మీద షాపుకి వచ్చి పుస్తకాల సంచీ విసిరేసి తనని వెనకాల నుంచీ చెంపలు తగిలేలా కావిలించుకున్నప్పటి పసిరూపాన్నే, ఇప్పుడు జానిబాబు కూర్చున్న స్థానంలో వరుడిగా కూర్చోబెట్టుకున్నాడు. అక్షింతల కింద నుంచి నవ్వాడు కన్నగాడు. వాడు చనిపోయాకా అలవాటైపోయిన, కుమ్మరించినట్టు మీదికొచ్చి పడే దిగులును-- తను తాగినపుడు మాత్రమే రానిచ్చే ధైర్యం చేసే దిగులును-- గొంతులో మెలిపడిన మడతలా దిగమింగుకుని, అక్కడి పరాచికాల వాతావరణం మీదికి మనసు మళ్ళించుకున్నాడు. ఎవరో ముత్తయిదువ జానిబాబుని ఆటపట్టిస్తుంటే దాన్ని పట్టించుకుని నవ్వుతున్నాడు.

కాస్త నిలదొక్కుకున్నాకా, చేతులు విప్పుకుని ముందుకెళ్ళి బల్ల మీద ప్లేట్లో అక్షింతలు అందుకుంటూ, “ఏ జానిబాబూ బావున్నావా,” అన్నాడు.

జానిబాబు “అంకుల్!” అని నవ్వుతూ గుర్తుపట్టాడు. షాపు గురించి అడిగాడు, ఆంటీ రాలేదేమని అడిగాడు, చెల్లిని ఎక్కడిచ్చారో కనుక్కున్నాడు.

సూర్రావు అక్షింతలు చల్లి, జానిబాబు అరచేతిని చేతుల్లో తీసుకుని నిమురుతూ సమాధానాలు చెప్పుకొచ్చాడు. హైదరాబాదులో జానిబాబు ఉద్యోగం గురించి అడిగాడు. సాయంత్రం పానింగిపల్లిలో పెళ్లికొస్తానని మాటిచ్చాడు. “పెద్దోడివైపోయావురా, ఎంబట్నే ఆనవాలు కట్టలేపోయాను,” అని జానిబాబు వీపు మీద మెత్తగా రుద్దాడు. ఎవరో పలకరించి జానిబాబు వాళ్ల వైపు తిరిగితే, బైటుంటానని బయల్దేరాడు.

బయట సూర్రావు నడిచి వెళ్ళిపోతుంటే, కృష్ణగారు ఎవరితోనో కారు దగ్గర నిల్చొని మాట్లాడుతున్నవాడల్లా, “ఏం సూర్రావ్, ఎక్కడికి? బోయనం చేస్సెళ్ళు,” అన్నాడు.

“మళ్లొత్తానండి,” అని గబగబా నడిచి వెళ్లిపోయాడు.

జానిబాబుకి అప్పటికి ఏం గుర్తు రాలేదు. ఎవరో భోజనాలకని లేపినపుడు పెరట్లో కాళ్లు కడుక్కుంటుంటే గుర్తొచ్చింది- ఎనిమిదో తరగతిలో ఆ రోజు బడి ఎగ్గొట్టి గోదాటి స్నానాలకెళ్లిన రోజు, స్నానాల రేవు దగ్గర, రాతి పలకల మీద, తడిసివున్న కన్నగాడి శరీరాన్ని ఒళ్లోకి తీసుకుని సూర్రావు గారు ఏడుస్తున్న దృశ్యం. జానిబాబు చెంబు బకెట్లో వదిలేసి గదులు దాటుకుని అరుగు మీదకు వచ్చి చూసాడు. భోజనాలు చేస్తున్నవాళ్ళలో ఎక్కడా సూర్రావు కనపడలేదు. కృష్ణగారు “ఏరా, ఏం కావాలి,” అని అడిగారు కింద నుంచి. “ఏం లేదు నానగారు,” అంటూ వీధి మలుపు వైపు చూస్తూండిపోయేడు.

*
"నవ్యాంధ్ర సాహిత్య ప్రత్యేక సంచిక" (ఫిబ్రవరి)లో ప్రచురితం

February 14, 2017

వచనానిది వేరే కవిత్వం‘‘పుస్తకాలనేవి కవిత్వానికి ఒక సందర్భం మాత్రమే’’ (Books are only occasions for poetry) అని అంటాడు బోర్హెస్‌. ఈ మాటలోని భావాన్నే కొనసాగిస్తే, అసలు మనం కవిత్వం అని పిలిచే ప్రక్రియ కూడా కవిత్వానికి ఒకానొక సందర్భం మాత్రమే అనవచ్చు. పై మాటకు ముందే బోర్హెస్‌, ‘‘జీవితం సాంతం కవిత్వ నిర్మితం. కవిత్వమేం పరాయిది కాదు, చుట్టుపక్కలే నక్కి వుంటుంది. ఏ క్షణమైనా మన మీదకు గెంతవచ్చు’’ అంటాడు. అలా మీదకు గెంతే కవిత్వాన్ని అక్షరాల్లో పట్టుకునేందుకు పద్యమెంత సాయపడుతుందో, వచనమూ అంతే సాయపడుతుంది. (ఈ వ్యాసంలో ‘పద్యం’ అంటే నా ఉద్దేశం ఛందోబద్ధ, వచన కవిత్వాలు రెండూను.)

మనవాళ్లు ‘‘వాక్యం రసాత్మకం కావ్యం’’ అన్నారు. నోటి మాటల తీరులో ఉండి, వ్యాకరణబద్ధమైన వాక్యాల సంచయమైతే చాలు అది వచనం అవుతుంది. 'Prose' అనే పదానికి కొన్ని ఇంగ్లీష్‌ నిఘంటువుల్లో కనీసం స్వతంత్రమైన నిర్వచనం కూడా లేదు. దానికి పద్యం కంటే వేరైనది అని మాత్రమే అర్థం చెబుతారు. ఆ పదాన్ని విశేషణంగా వాడినపుడు ‘చప్పగా’, ‘నీరసంగా’ అనే అర్థంలో వాడతారు. కానీ ఇక్కడ నేను చరిత్ర పుస్తకాల్లోనూ, ఆత్మకథల్లోనూ, వార్తాపత్రికల్లోనూ, కరపత్రాల్లోనూ, వ్యాసాల్లోనూ, ప్రభుత్వ ఆఫీసు లేఖల్లోనూ కనిపించే వచనం గురించి మాట్లాడటం లేదు. వచనం అంటే ఇక్కడ నా ఉద్దేశం కథలు చెప్పే వచనం. ఎందుకంటే, మిగతావాటిలా గాక కథా, కవిత్వమూ ఊహాశక్తికి సంబంధించినవి. రష్యన్‌ రచయిత వ్లదీమర్‌ నబొకొవ్‌ సాహిత్యం పుట్టుక గురించి ఇలా ఊహిస్తాడు: ‘‘ఒక ఆదిమ బాలుడు ‘తోడేలు తోడేలు!’ అని లోయలోంచి అరుచుకుంటూ వచ్చినప్పుడూ, అతడ్ని వెంటాడుతూ పెద్ద తోడేలు కనిపించినప్పుడూ కాదు సాహిత్యం పుట్టింది; ఒక ఆదిమ బాలుడు ‘తోడేలు తోడేలు!’ అని లోయలోంచి అరుచుకుంటూ వచ్చినప్పుడూ, వెనక ఏ తోడేలూ లేనప్పుడూ సాహిత్యం పుట్టింది.’’

మొదట్లో పద్యం ఒక్కటే ఉండేది. మహాకావ్యాల (epics) కాలంలో కథల్ని కూడా పద్యాల్లోనే చెప్పారు. మానవుడి అనుభవ ప్రపంచం విస్తృతమయ్యే కొద్దీ పద్యం తీసుకునే ఇతివృ త్తాలు సునిశితమయ్యాయి. ఆ ఇతివృత్తాల్ని స్వీకరించేందుకు పద్యానికి కథ అనే చట్రం అడ్డమయ్యింది. దాంతో కథ చెప్పే బాధ్యతను వచనం తీసుకుంది. పద్యాలు కట్టేవాళ్ళు కవులూ, కథలు రాసేవాళ్ళు కథకులూ అయ్యారు.

కొందరు కవులకు వచనమంటే చులకన. కవుల దాకా ఎందుకు, అసలు కథకులే కవిత్వానికి పెద్దపీట వేసిన సందర్భాలెన్నో. సోమర్సెట్‌ మామ్‌ ఒక చోట, ‘‘సాహిత్యానికి మకుటం కవిత్వమే. అదే దాని లక్ష్యమూ, పరమార్థమూను. కవులు ఇలా నడిచొస్తుంటే కథకులు చేయగలిగిందల్లా పక్కకు తప్పుకొని దారివ్వటమే’’ అంటాడు. ఇంగ్లీష్‌ కవి కోలరిడ్జి ‘‘వచనంలో పదాలు వాటి సరైన క్రమంలో ఉంటే చాలు; కవిత్వంలో సరైన పదాలు సరైన క్రమంలో ఉండాలి’’ అంటాడు. రష్యన్‌ కవి జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ వచనానికి క్రమశిక్షణ నేర్పే గురువు కవిత్వమే అంటాడు. కానీ నేర్చుకునే విషయంలో వచనం సోమరి విద్యార్థిగానే మిగిలిపోయిందని వాపోతాడు. మనవాళ్ళు కూడా ‘‘వచనమై తేలిపోవటం’’ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆధిక్యతా భావానికి ఒక కారణం తడుతుంది. పద్యాన్ని ఏ మార్పూ చొరనివ్వనంత పకడ్బందీగా నిర్మించటం సులువు. నిడివి పరిమితం కావటం మూలానా, నిర్మాణ రీతి మూలానా పద్యాన్ని ఆద్యంతం అదుపులో ఉంచుకు నడిపే వీలుంటుంది. కానీ వచనానికి అంత కట్టుదిట్టమైన రూపాన్నివ్వటం దాదాపు అసాధ్యం. అది అసంపూర్ణతల్ని ఒప్పుకునే ప్రక్రియ. ఆధునిక నవలకు ఆద్యుడైన ఫ్లాబె ‘మదాం బోవరీ’ నవల రాసేటప్పడు తన ప్రేయసికి పంపిన ఒక ఉత్తరంలో What a bitch of a thing prose is!'' అని వాపోతాడు: ‘‘ఎంత దుంప తెంచుతుంది ఈ వచనం! ఎప్పటికీ ఓ కొలిక్కి రాదు; తిరగరాయాల్సింది ఏదో మిగిలే ఉంటుంది. కానీ వచనంలో కూడా పద్యం లాంటి నిలకడ సాధించవచ్చుననే అనుకుంటాను. వచనంలో మంచి వాక్యం ఉందంటే అది పద్యంలో ఒక మంచి పంక్తి ఉన్నట్టే ఉండాలి--మార్చటానికి వీల్లేకుండా, అంతే లయతో, అంతే శ్రావ్యంగా.’’ 

అయితే ఇలా మార్చి రాయటానికి వీల్లేని వాక్యాల్ని ఫ్లాబె నవలల్లో కూడా మహా అయితే పేజీకి మూణ్ణాలుగు మాత్రమే పట్టుకోగలమని అనుకుంటాను. నవల మొత్తం అలా ఒక్క వాక్యమూ ‘‘మార్చటానికి వీల్లేని’’ వచనం రాయటం ఆయనకే కాదు, ఎవరికీ వీలు కాదనే అనుకుంటాను. అసలు ఆయన పెట్టుకున్న ఆదర్శాలే వచనానికి తగనివి. లయాత్మకతంగా సాగే వచనం కథ చెప్పటానికి అడ్డం కాదా? ప్రాసానుప్రాసాది విన్యాసాలతో వున్న వచనాన్ని ఎన్ని పేజీల దాకా భరించగలం? అవన్నీ పద్యానికి తగిన లక్షణాలు. అది కూడా ఛందోబద్ధమైన పద్యానికి. ఆధునిక పద్యానికి మెటఫర్‌, సిమిలీ, ఇమేజరీ ఇత్యాదులు ప్రధానాంగాలయ్యాయి. ఇవి వచనంలోనూ అంతర్భాగమే. కానీ వచనం చేయగలిగే ఇంకెన్నో విషయాలతో పోలిస్తే వీటి ప్రాధాన్యత తక్కువే. వచనం కవిత్వం కావటానికి ఉన్న దారులు వేరు.

ఫలానా రచయిత వచనం ‘‘అచ్చం కవిత్వంలా ఉంది’’ లాంటి పొగడ్తలు అప్పుడప్పుడూ వింటాము. మామూలుగా పద్య లక్షణాలైన అలంకారిక వ్యక్తీకరణల దట్టింపూ, లయాత్మక శైలీ, ప్రతీకలూ, అటు నోటి మాటల్ని కానీ ఇటు వ్యాకరణాన్ని కానీ అనుసరించక రచయిత తాలూకూ ఉద్వేగంతో ఛార్జ్‌ ఐన అసంపూర్ణ వాక్య శకలాలూ- ఇలాంటివేవో కనపడినప్పుడు ఈ పొగడ్తలు వింటాము. కానీ ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు వచనం పద్యం చేసే పనుల మీదే ఎక్కువ శ్రద్ధపెట్టిందనీ, వచనం మాత్రమే చేయగలిగే మరెన్నో చేయలేకపోతోందనీ అర్థం. ఏమిటీ వచనం మాత్రమే చేయగలిగేవి? వచనాన్ని గురించి నాకెంతో ఇష్టమైన మాట ఒకటుంది. ఇంగ్లీష్‌ రచయిత హెన్రీ గ్రీన్‌ వచనాన్ని ఇలా నిర్వచిస్తాడు: "Prose is not to be read aloud but to oneself alone at night, and it is not quick as poetry but rather a gathering web of insinuations...''

ఈ వాక్యంలోని సారమంతా "gathering web of insinuations'' అనే పదాల్లో ఉంది. ఈ పదాల్లో మొత్తం వాక్యానికే శక్తినిస్తున్న "insinuations'' అనే పదాన్ని దాని నెగెటివ్‌ ఛాయలతో సహా తెలుగులోకి అనువదించటం కష్టం: ‘‘వచనాన్ని పైకి కాదు, రాత్రుళ్ళు మనకు మనం ఒంటరిగా చదువుకోవాలి. వచనం కవిత్వంలా చప్పున పనిచేయదు. అది మెల్లగా కమ్ముకొనే అన్యాపదేశాల వల...’’ అని ఉజ్జాయింపుగా అనువదించుకోవచ్చు. చెప్పదల్చుకున్నదాన్ని మంచి వచనం ఒకే చోట సాంద్రంగా వ్యక్తం చేయదు. దాన్ని పాఠ్యమంతటా పల్చగా వెదజల్లుతుంది. అక్కడో సూచనా ఇక్కడో సూచనా మినుకు మినుకుమంటూ, పాఠకుడ్ని కలిపి చదువుకొమ్మనీ, కథను అల్లుకొమ్మనీ ఆహ్వానిస్తాయి.

అలాగే వచనానికే సాధ్యమయ్యే మరో లక్షణం, అది మనుషుల్ని రానిస్తుంది. శ్రీశ్రీ ‘భిక్షువర్షీయసి’, తిలక్‌ ‘తపాలా బంట్రోతు’ లాంటి పద్యాల్లో మనుషులు లేరా అంటే ఉన్నారు. కానీ పద్యంలో వాళ్ళు నేరుగా కనిపించరు. కవి అంతరంగపుటద్దంపై వారి ప్రతిబింబాలు మాత్రమే కనిపిస్తాయి. వచనంలోనికి మనుషులు నేరుగా నడిచి వస్తారు, తమ మాటలు తామే మాట్లాడతారు. అంటే దానర్థం రచయిత తానున్న చోటు నుంచి మాట్లాడ్డం గాక, వాళ్ల వైపు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. (అసలు మనం మనల్ని తప్పితే పక్కనున్న మనిషిని తెలుసుకోవటం సాధ్యం కాదనే తీవ్రమైన ఆత్మాశ్రయత్వం వచనమనే వ్యవస్థనే కుప్పకూలుస్తుంది. పరాయి ప్రపంచాల పట్ల కుతూహలమూ, ఆర్తీ కథలల్లే వచనకారుడి కనీస అర్హతలు.)

మనుషులకి అనుకరణలో (Mimesis) ఏదో చెప్పరాని సంతోషం దొరుకుతుంది. ఈ అనుకరణని అవధుల దాకా తీసుకెళ్లగలిగేది వచనం. కథలు రాసేవాడు సాక్షాత్తూ దేవుడ్నే అనుకరిస్తాడు (ఇక్కడ దేవుడంటే సృష్టిలో అతిశక్తివంతమైన మెటఫర్‌). దేవుడు కూర్చొని మనుషులకు పోత పోసినట్టు, ఈ కథలు రాసే మనిషి కాగితం ముందు కూర్చొని నీడల్లాంటి మనుషులకు పోతపోస్తాడు. వాళ్ళు తమ వెతలూ సంతోషాలతో సహా ఏదో నిజంగా భూమ్మీద మసలిన మనుషుల్లా మనకు గుర్తుండిపోతారు. సమస్త ప్రకృతిని వచనంలో అనుకరించినంత దగ్గరగా పద్యంలో అనుకరించలేము. అందుకే పుష్కిన్‌ని ఉదహరిస్తూ నబొకొవ్‌- కవుల్లో ఏంబిషన్‌ ముదిరితే ఇక కవిత్వాన్ని పక్కపెట్టి కథల వైపు మళ్లుతారని అంటాడు. ఇక్కడ ఏంబిషన్‌ అంటే కీర్తి దాహమూ అట్లాంటివి కాదు. తనతో సహా సృష్టినంతట్నీ అక్షరాల్లోకి తెచ్చిపోసెయ్యాలనే దాహం. నబొకొవ్‌ మాటల్లో: "the art of seeing the world as the potentiality of fiction.'' (ప్రపంచాన్ని కథలు తోడుకునేందుకు పనికొచ్చేదిగా చూసే కళ.)

బైబిల్లో దేవుడు ఆదాంని సృష్టించి, ఆ తర్వాత జంతుజాలాన్నంతా సృష్టిస్తాడు. జంతువులన్నింటినీ ఆదాము ముందుకు తీసుకువచ్చి వాటికి అతను ఏ పేర్లు పెడతాడో అవే ఖాయం చేస్తాడు. దేనికైనా పేరు పెట్టి ఇదీ అని చెప్పటంలో మనిషికి ఏదో ఆనందం ఉంది. జీవితంలోంచి ఏరుకున్న దృశ్యాల్ని కల్పన సాయంతో అటుదిటుగా చేసి కాగితంపై ఖర్చుచేయటంలో ఆనందం ఉంది. నోటి మాటల్ని ఉన్నదున్నట్టు పట్టుకోవటంలో ఆనందముంది. ఆ మాటల వెనక తచ్చాడే జీవితాల్నీ, మారే అంతరంగ ఛాయల్నీ సూచించటంలో ఆనందముంది. మనుషుల రూపాల్నీ, కవళికల్నీ, భంగిమల్నీ, పద్ధతుల్నీ స్ఫురింపజేయటంలో ఆనందం ఉంది. ఫలానా పరిస్థితుల మధ్య వచ్చిపడ్డ మనుషుల స్వభావాల్నో, ఫలానా మనుషుల స్వభావాల వల్ల వచ్చిపడ్డ పరిస్థితులనో జతకూర్చటంలో ఆనందం ఉంది. ఇవే వచనానికి ప్రత్యేకమైనవీ, వచనాన్ని కవిత్వం చేసేవీను.

దాస్తోయెవ్‌స్కీ ‘క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌’లో మార్మెలాడోవ్‌ తాగుబోతు ఉపన్యాసం నిండా దొర్లే బతుకు బీభత్సమూ; టాల్‌స్టాయ్‌ ‘అన్నా కరేనినా’లో వ్రాంస్కీ పాల్గొనే గుర్రాల రేసు కళ్లకు కట్టించే హోమరిక్‌ సౌందర్యమూ; కాఫ్కా ‘మెటమార్ఫసిస్‌’లో కీటకంగా మారిన గ్రెగర్‌ చుట్టూ మారే అతని కుటుంబ సభ్యుల స్వభావాలూ; ఫ్లాబె ‘సెంటిమెంటల్‌ ఎడ్యుకేషన్‌’లో కాలచక్రం జీవితాన్ని నింపాదిగా తొక్కుకుంటూ పోతున్నప్పుడు యవ్వనపుటాశలు కిందపడి నలిగే చప్పుడూ ఇదంతా వచనానికి మాత్రమే సాధ్యమయ్యే కవిత్వం.

ఇలా వచనానికి తనదంటూ ఒక కవిత్వం ఉంది. అది వదిలేసి, పద్యానికి ఒప్పే కొన్ని లక్షణాల్ని వచనంలో ప్రదర్శించినంత మాత్రాన, ఆ ఒక్క కారణానికే దాన్ని గొప్ప వచనం అనలేము. ఆలూరి బైరాగి ‘జేబుదొంగ’లో ఈ ఇబ్బంది చూస్తాను. ఆ కథ మొదట్లోనూ చివర్లోనూ బైరాగి ప్యూర్‌ పద్యాన్ని వాక్యాలుగా కలిపి రాసేస్తాడు. ‘‘మెల్లగా కమ్ముకొనే అన్యాపదేశాల వల’’ని పన్నటానికి బదులు, చెప్పదల్చుకున్నదంతా సాంద్రంగా ఒకేచోట కుమ్మరించేస్తాడు: ‘‘మరఫిరంగుల జోలపాట, మత్తుగల చీకట్ల కోనేట్లో పసరునీరుల కదలిక. ఆకాశపు ఆవులింత. కబంధుని కౌగిలింతలో పగిలిన మట్టిముంత. అహో! జీవితపు రక్తోజ్వల ముక్తిక్షణమా’’ అంటూ మొదలయ్యే ఈ కథలో కవిత్వమైతే ఉంది, కానీ అది వచనం తాలూకు కవిత్వం కాదు. ఆయన కథే ‘దరబాను’లో ఈ ఇబ్బంది లేదు. ‘జేబుదొంగ’ కథలో మన ముందుకు ఆ జేబుదొంగ రాడు, కానీ ‘దరబాను’ కథలో ఆ దరబాను (నేపాలీ గూర్ఖా) నేరుగా మన ముందుకొస్తాడు. బైరాగి తనలోని పద్యకారుడ్ని తొక్కిపట్టి, కథకునిగా తన ఊహను దరబాను వైపు ప్రసరింపజేస్తాడు. పల్లెటూరి నుంచి పరాయి దేశపు మహా నగరంలోనికి వచ్చిపడ్డ ఆ మనిషి ఒంటరితనాన్ని ఆర్తిగా స్పృశిస్తాడు.

అలాగే పతంజలి కవితాత్మకంగా రాసిన కథ అని చెప్పే ‘చూపున్న పాట’ కంటే, హాస్య కథ అని చెప్పే ‘రాజుగోరు’లో ఎక్కువ కవిత్వం ఉంది. పాఠకుల్లో ఉద్వేగం కలిగించాల్సింది పోయి రాస్తున్న రచయితే ఉద్వేగంతో ఊగినప్పుడూ, మేజిక్‌రియలిజం అనే ట్రెండ్‌కి మనమూ ఏదోటి రాద్దామని ఆత్రపడినప్పుడూ వచ్చే కథ ‘చూపున్న పాట’. కానీ ‘రాజుగోరు’ మాత్రం పైకి హాస్య కథలా నడుస్తూనే, వచనానికి మాత్రమే వీలయ్యే ఎంతో కవిత్వాన్ని పొదువుకున్న కథ. ఆయన వ్యవస్థపై ధిక్కారమంటూ రాసిన ‘ఖాకీవనం’, ‘పెంపుడు జంతువులు’ లాంటి మీడియోకర్‌ రచనల కన్నా ఎంతో ఎత్తు నున్న కథ. పతంజలి ఇందులో మెట్టు తర్వాత మెట్టు అన్నట్టు క్రమబద్ధ సమీకరణంలాగ కథ చెప్పడు. వివరాల్ని ఎంతో అలవోకగా కథంతా వెదజల్లుతాడు. తను కథ చెప్పటమే కాదు, పాత్రల నోటమ్మటా కూడా ఎన్నో కథల్ని కమ్మగా చెప్పిస్తాడు. వచనం వెనుక జీవితపు నాడి కొట్టుకోవడం తెలుస్తుంది. ఉదాహరణకి, రైతు అప్పల్నాయుడు తన అత్తకు వంట్లో బాలేకపోతే మందు తెద్దామని కలగాడ నుంచి బయల్దేరి అలమండ రాజుల సావిట్లోకి వస్తాడు. అతనికి అలమండ రాజ వంశస్థులు ఫకీర్రాజూ, అతని అసిస్టెంటు గోపాత్రుడూ ఏదో పేరు తెలీని మందు ఇచ్చి పంపేస్తారు. మర్నాడు ఇద్దరూ మందు ఎలా పని చేసిందో కనుక్కుందామని కలగాడ వెళ్తారు. ఇల్లు వెతుక్కుంటుంటే, నెత్తి మీద గడ్డిబుంగతో వచ్చిన మనిషి ఒకడు వాళ్ళని పలకరించి అప్పల్నాయుడి ఇల్లెక్కడో వివరం చెప్తూనే అప్పల్నాయుడి మీద బూతులు లంకించుకుంటాడు. తను ఉంచుకున్న నూకాయమ్మతో అప్పల్నాయుడు సంబంధంపెట్టుకున్న సంగతీ, మొన్న సోమవారం సంతలో అతని మీద గొడవకెళ్లిన సంగతీ చెప్తూ, మళ్ళీ ఆమె జోలికి రావొద్దని అప్పల్నాయుడికి చెప్పండని చెప్పిపంపిస్తాడు. ఈ పాత్రతో కానీ, ఇతను వెళ్ళబోసుకున్న గోడుతో గానీ కథకు ఏ సంబంధమూ లేదు. ఈ నూకాయమ్మ ప్రస్తావన ఇంకోసారి కథ చివర్లో పోలీస్ స్టేషన్లో అప్పల్నాయుడి బావయిన బాంబులోడి నోటమ్మటా వస్తుంది- మళ్ళీ కథకు ఏ సంబంధమూ లేకుండానే. అసలు కథ మొదలవటమే ఏ సంబంధమూ లేకుండా పెదసావిట్లో కూర్చుని హుక్కా పీలుస్తూన్న పెద్ద అప్పల్రాజుగారితోనూ, మందుకోసం వచ్చిన అప్పల్నాయుడ్ని ఆయన ఊరికే కాలక్షేపానికి నిలేసి కబుర్లు చెప్పటంతోనూ మొదలవుతుంది. ఇలాగ మన జీవిత కథలతో నేరుగా ఏ సంబంధమూ లేకుండా ఊరకే చుట్టూ ముసురుకునే వివరాల్లోని కవిత్వాన్ని వచనం బాగా పట్టుకుంటుంది. హెమింగ్వే ‘ద ఆర్ట్‌ ఆఫ్‌ షార్ట్‌ స్టోరీ’ అనే వ్యాసంలో చెహోవ్‌ చెప్పిన ఒక నియమాన్ని ఇలా కొట్టిపారేస్తాడు: ‘‘కథ మొదలుపెట్టినప్పుడు గోడ మీద తుపాకీ వేలాడుతోందంటే పద్నాలుగో పేజీలోగా అది పేలి తీరాలీ అన్న మాటలో నిజం లేదు. అసలు నా ఉద్దేశంలో, అలా గోడకు తగిలించిన తుపాకీ పేలను కూడా పేలకపోవచ్చు. మంచి రచయిత రాసిన కథలో ఐతే ఎవడో పనికిమాలినోడు ఆ తుపాకీని చూట్టానికి బాగుందని అక్కడ తగిలించి ఉంటాడంతే. లేదూ ఆ ఇంటాయనకి తుపాకుల పిచ్చి ఉండొచ్చు. అదీ కాదంటే, ఇంటీరియర్‌ డెకరేటర్‌ దాన్నక్కడ తగిలించి వుండొచ్చు.’’ చెప్పొచ్చేదేమిటంటే- జీవితాన్నీ, దాని పద్ధతీపాడూ లేనితనాన్నీ వచనం మన్నిస్తుంది, పట్టింపులేమీ లేకుండా రానిస్తుంది.

జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ ‘హౌ టు రీడ్‌ ఎ బుక్‌’ అన్న వ్యాసంలో కవిత్వం నుంచి వచనం నేర్చుకోవాల్సినవి క్లుప్తతా, ఉన్నతమైన భాషా ప్రమాణాలూ అంటాడు. నిజానికి అవి రాసేవాళ్లని బట్టి ఉంటాయి. కవిత్వాన్ని ఊకదంపుడుతోనూ, జర్నలిస్టు భాషతోనూ నింపేవాళ్లున్నారు. బైబిల్‌ పాత నిబంధన కథల్లోని క్లుప్తతకు సాటి ఏముంది? చుట్టూ వినపడే మనుషుల మాటల కన్నా భాషకు ఉన్నతమైన ప్రమాణాలేవీ? కనుక వచనం ఈ గుణాల్ని ప్రత్యేకించి కవిత్వం నుంచే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బ్రాడ్‌స్కీ మాటల్లో ఉన్నది సొంత వ్యాసంగం పట్ల అందరికీ ఉండే బడాయే ననిపిస్తుంది. పద్యమూ, వచనాల్లో ఏది గురువూ, ఏది లఘువూ అని తేల్చుకునే కన్నా, కవిత్వం కావటానికి రెండింటికీ ఉన్న దార్లు వేరు అనుకుంటే సరిపోతుంది.