June 18, 2019

డిగ్రీ ఫ్రెండ్స్నలభైకి దగ్గరపడే కొద్దీ నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. తెల్లారగట్ల పార్కులో పరిగెడుతున్నాను. మొదట్లో ఓ పదడుగులేయటం కష్టంగా ఉండేది. ఇప్పుడు పావు కిలోమీటరు పైనే ఆగకుండా పరిగెత్తగలను. మొన్నో రోజు పరుగు మధ్యలో ఉండగా పాత విషయం ఒకటి గుర్తొచ్చింది- పదేళ్ళ క్రితం రెడ్డీ, బాషా, నేనూ వేసుకున్న పరుగుపందెం, అదీ సముద్రం దగ్గర… స్నేహ సమయాల్ని అలలపై తీసుకెళ్లి దాచిపెట్టి మళ్ళీ ఎప్పుడు తిరిగొచ్చినా తెచ్చిచ్చే సముద్రం…. ముగ్గురం వైజాగ్ బీచ్‌లో నడుస్తున్నాం. రెడ్డి అన్నాడు పరిగెడదామా అని. చెప్పులు విడిచి, ఫాంట్లు మోచిప్పలపైకి మడతపెట్టి, వరుసలో నిలుచున్నాం. మూడంకెలు లెక్కపెట్టి పరుగు… ఇసకలో ముద్రలు గుద్దుతూ పాదాలు… మహాయితే పదిసెకన్లు వాళ్ళిద్దరికంటే ముందున్నానేమో. తర్వాత నన్ను దాటేశారు. నాకు దమ్మయిపోయి, ఇసుకలో కూలబడిపోయినా, ఇద్దరూ పరిగెడుతూనే ఉన్నారు. చివరకి బక్కోడు బాషాగాడే రెడ్డిని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. పార్కులో పరుగు మధ్యలో ఇది గుర్తు రాగానే అనిపించింది- ఈసారి పందెం పెడితే నేనే గెలుస్తానని. అంటే ఈలోగా నేనేదో యవ్వనాన్ని వెనక్కు తెచ్చేసుకున్నానని కాదు. బాషాకి నాలుగేళ్ళ క్రితం కాలు విరిగింది. మండపేటలో వాళ్ళ చెప్పుల షాపులో పైఅరల్లోంచి చెప్పులు తీయబోతూ పొడవాటి స్టూలు మీంచి కిందపడ్డాడు. ఒక ఏడాది పాటు సరిగా నడవలేకపోయాడు. ఇప్పటికీ పరిగెత్తే సీనైతే ఉందని అనుకోను. రెడ్డిగాడు కూడా వారానికి ఐదు రోజులు మాచవరం నుంచి ఒంగోలు వెళ్ళి చేయాల్సిన ఫైనాన్స్ వ్యాపారంతో శరీరాన్ని ఎంత పట్టించుకుంటున్నాడన్నది అనుమానమే.

పదేళ్ళ క్రితం వైజాగ్ వెళ్ళింది అక్కడ్నించి అరకు వెళ్దామని. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ముగ్గురం మండపేటలో కలుసుకున్నాం. ముందు వైజాగ్‌లో దిగి అక్కడుంటున్న కృష్ణగాడిని కూడా మాతో కలుపుకు పోదామనుకున్నాం. కృష్ణ మాతోపాటు మండపేట గవర్నమెంటు కాలేజీలోనే డిగ్రీ చదివి తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాడు కుటుంబంతోపాటు. వైజాగ్ బస్‌స్టేషన్‌లో మమ్మల్ని రిసీవ్ చేసుకుంది మొదలు కృష్ణగాడు తను అదివరకట్లా ముద్దపప్పు కాదని నిరూపించుకోవటానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. కలిసిన కాసేపట్లోనే ఇన్స్టిట్యూట్లో లైన్లో పెట్టిన అమ్మాయి గురించి చెబుతున్నాడు. కానీ వాడి ఇంటికి వెళ్ళగానే పాత సీనే కనిపించింది. కృష్ణ వాళ్ళమ్మగారు వాడి మీద ఇదివరకట్లాగే అరుస్తున్నారు, మా ముందు కూడా.  కృష్ణగాడు ఒకపక్క అమ్మంటే లెక్క లేదన్నట్టు మాకు కటింగ్ ఇస్తూనే, మరోపక్క ఆ ప్రయత్నంలో ఆవిడకి దొరికిపోకుండా జార్త పడుతున్నాడు. మేం ముగ్గురం పక్కగదిలో కూర్చుని నవ్వుకుంటున్నాం. ఒకసారి మండపేటలో వాళ్ళమ్మ వల్లే కృష్ణ పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. పక్కింటివాళ్ళతో ఏదో గొడవైతే ఆవిడ గిన్నె నిండా నూనె మరిగించి వాళ్ళ మీదకి విసిరేసిందట. వాళ్ళు ఎస్సీలు, వీళ్ళు కమ్మోళ్ళు. అట్రాసిటీ కేసయ్యింది. కృష్ణ మరి తప్పకో ఏమో కేసు తన మీద వేసుకున్నాడు. ఆ రోజు మేం కాలేజీలో ఉండగా తెలిసింది వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని. సైకిళ్ళమీద పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాం. కృష్ణగాడు లోపల్నించి మెల్లగా నడుచుకుంటూ వచ్చి మా పక్కన కూర్చున్నాడు. వాడ్ని రాత్రి చాలాసేపు బల్ల మీద బోర్లా పడుకోబెట్టి అరికాళ్ళ మీద కర్రలతో కొట్టారంట. తర్వాత నేల మీద నీళ్ళు పోసి అందులో నడిపించారంట. ఇదంతా కృష్ణగాడు నవ్వుతూనే చెప్పాడు. ఆ నవ్వులో కొంచెం విరక్తి వున్నా అదీ పైపైనే అనిపించింది. ఒకవేళ వాడికి ఇదంతా కొత్త అనుభవంలాగ ఉందేమో. చెప్పటం పక్కింటివాళ్ళు దొంగ కేసుపెట్టారని చెబుతున్నాడు. మాకైతే అనుమానమే. వాళ్ళమ్మగారు బాగా దూకుడు మనిషని అనిపించేది. మేం స్టేషన్ నుంచి తిరిగి కాలేజీకి వెళ్ళేసరికి లాబ్‌లో బోటనీ క్లాసు జరుగుతుంది. మేం ముగ్గురం వెనక బెంచీలో కూర్చుని పోలీస్ స్టేషన్లో జరిగింది మాట్లాడుకుంటున్నాం. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి అంతసేపు కూర్చోవటం మాకు అదే మొదటిసారి. పైగా నిన్నటిదాకా మాతో కలిసి తిరిగినవాడు, మా ఫ్రెండ్, స్టేషన్లో ఉండటం, పోలీసుల చేత తన్నులు తినటం… ఏదో పెద్దాళ్ళలోకంలోకి తలుపు పూర్తిగా తెరుచుకున్న ఫీలింగ్. క్లాసు మధ్యలో మాట్లాడేట్టయితే బైటికి పొమ్మంది బోటనీ మేడమ్. నేను ఎక్కళ్ళేని ధైర్యంతో పదండ్రా అని లేచాను. ముగ్గురం కాలేజీ వెనక తోటలో జాంచెట్టు కొమ్మలకి ఆనుకుని ఆ పీరియడ్ అయ్యేంత దాకా మాట్లాడుకున్నాం. అమ్మంటేనే భయపడే కృష్ణగాడు పోలీస్ స్టేషన్లో అంత నిబ్బరంగా ఉండటం చూసి మాకు ఆశ్చర్యమేసింది. ఆ తర్వాత నాలుగైదు రోజులకి కృష్ణగాడ్ని వదిలిపెట్టారు. కేసు మాత్రం కొన్నేళ్ళపాటు నడిచింది. ఈ గొడవ తర్వాతే వాళ్ళ కుటుంబం మండపేట వదిలేసి వైజాగ్ వచ్చేసింది.

కృష్ణ మాతోపాటు అరకు రాలేనన్నాడు. కానీ జూపార్కు, కైలాసగిరి తిప్పి చూపిస్తానన్నాడు. వాడు మాతో ఏడేళ్ళ క్రితం చదివినదానికీ ఇప్పటికీ చాలా మారిపోయాడు. ఏడేళ్ళ క్రితం తన స్వభావం ఇప్పుడు వాడికి నచ్చట్లేదనుకుంటాను. ఆ కాలాన్ని గుర్తు చేసే మా మీదా ఇష్టం పోయినట్టుంది. అంటీముట్టనట్టు ఉన్నాడు. వాడి సర్కిల్ వాడికి ఉంది. మాతో తిరుగుతున్నా వాడి ఫోన్లు వాడికి వస్తున్నాయి. ఇంక మేమూ వాడ్ని మా ప్లాన్లోంచి పక్కకి తీసేసాం. మధ్యాహ్నానికి కైలాసగిరి దగ్గర మమ్మల్ని వదిలి పనుందని వెళ్ళిపోయాడు. కొండ మీద రెడ్డిగాడి ధ్యాసంతా జంటల మీదే. వాళ్ళు కాస్త పొదల పక్కకి వెళ్తే చాలు వీడిక్కడ తలకిందులైపోతున్నాడు. బాషాకి మాత్రం ఇదంతా ఇబ్బందిగా ఉంది. రెడ్డిగాడ్ని నవ్వుతూనే విసుక్కుంటున్నాడు. కాస్త కిందకి దిగి కొండవాలులో కూర్చున్నాం. అక్కడ్నించి చూస్తుంటే వైజాగ్ నగరానికి మూడు వైపులా కొండలూ, ఒకవైపు సముద్రం ఉన్నాయేమో అనిపించింది. కింద అలల నురగలు సన్నగా దారాల్లాగా ఒడ్డు వైపు కదులుతున్నాయి. అసలైన జీవితానికి ఇంకా ఇటువైపే ఉన్నామన్న ఉత్సాహం. ముందున్న జీవితమంతా ఏ కాలుష్యాలూ లేకుండా, మేం ఎటు వెళ్తే అటు రమ్మంటూ లెక్కలేనన్ని దారులుగా విడిపోయి పరుచుకుంటుందనే నమ్మకం. కొండ మీంచి ఆటోలో రుషికొండ బీచికి వెళ్ళాం. సముద్రంలోకి పొడుగ్గా పొడుచుకెళ్ళిన రాళ్ళగుట్ట మీద చివరిదాకా వెళ్ళి స్నానం చేశాం. అలలూ, వాటితో కలబడే ఆడాళ్ళూ. తడిబట్టల్లోంచి వైనం తెలుస్తున్న వొళ్ళు. తలతిరిగేదాకా స్నానం చేసాం. ఐసులు చీక్కుంటూ, ఒడ్డు వారన అలా నడుచుకుంటూ పోయాం. పోయేకొద్దీ మనుషుల సందడి పల్చబడింది. వాళ్ళ కేకలు పల్చగా అలల వెనక్కి. చెట్లలోంచి ఏదో పక్షికూత- ఇటు రావొద్దన్నట్టు. బట్టలు వొంటి మీదే ఆరిపోయాయి. కడుపులో ఏమీ లేని, అలాగని ఆకలీకాని తేలికతనం. అప్పుడే రెడ్డి పరుగుపందెం అన్నాడు. ఆ రాత్రి ముందనుకున్నట్టు కృష్ణ ఇంటికి వెళ్ళకుండా లాడ్జిలో రూమ్ తీసుకున్నాం. ఒకే పెద్ద మురికి మంచం మీద సర్దుకుని పడుకున్నాం.

మర్నాడు బొర్రాగుహలు, అరకు. రైల్లో డోర్స్ దగ్గరంతా కుర్రాళ్ళు ఆక్రమించేశారు. టన్నెల్స్ వచ్చినప్పుడల్లా చీకట్లో పొలికేకలు పెడుతున్నారు. మేం కిటికీల్లోంచి తొంగి చూస్తున్నాం. కుడివైపున్న లోయలో ఒక చోట పచ్చటి మైదానంలో అగ్గిపెట్టెలకన్నా చిన్నగా ఇళ్ళు కనిపించాయి. అక్కడో గుడిసన్నా వేసుకుని బతకటం ఎంత బావుంటుందో కదా అనిపించింది. ‘బొర్రాగుహలు‘ స్టేషన్లో దిగి బయటకి వస్తే జీపులు ఉన్నాయి. ఆ బేరం అదీ వాళ్ళిద్దరే మాట్లాడారు. జీపులో వెళ్తుంటే రెడ్డిగాడు నా గురించి బాషాతో అంటున్నాడు: “మనమేమో ఈ రైలు టైమింగ్సూ, ఈ జీపులు మాట్లాడటం లాంటి చిల్లర మల్లర విషయాలన్నీ చూసుకోవాలి, అయ్యగారు మాత్రం ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటారన్నమాట.

“ఎందుకురా అలా కుళ్ళిపోతున్నావ్? ఎలాగూ మీరు మాట్లాడుతున్నారు కదాని వదిలేసేను,” అన్నాను.

“అదేలేరా… నువ్వు పెద్ద కవివి… అన్నీ అలా డీప్‌గా ఎంజాయ్ చేస్తావు. మేమేదో అలా పైపైన బతికేస్తుంటాం..” అన్నాడు.

నా మీద వాడి అభిప్రాయానికి కారణముంది. నేను హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో పెద్ద పెద్ద ఆలోచనలతో వాడికి ఉత్తరాలు రాసాను. అసలు అంతకుముందే డిగ్రీ చదువుతుండగానే వాడికి ఒక పెద్ద ఉత్తరం రాసాను. ఏదో గొడవై, ఎందుకో గుర్తులేదు, వాడు కొన్ని రోజులు నాతో మాట్లాట్టం మానేశాడు. నన్ను పక్కనపెట్టినట్టు నాకే తెలిసేలా ప్రవర్తించాడు. క్లాసులో మేమున్నదే లింగులింగుమంటూ నలుగురం. అంతకుముందు ఏడాది క్రితమే కొత్తగా పెట్టిన ఆ గ్రూపులో ఎవరూ చేరలేదు. మాకంటే ఆడాళ్ళే ఎక్కువ- పదిమంది పైనే. ఉన్న నలుగురు మగాళ్ళలో కృష్ణగాడెలాగూ మాతో కలిసి సినిమాలకి రావటంకానీ, వాలీబాల్ ఆడటంకానీ, ఇంకా క్లాసు బైటచేసే వేరే ఏ పనికిమాలిన పనిలోనీ తోడొచ్చేవాడు కాదు. ఇంక మిగిలిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాట్లాడుకోపోతే ఎలా ఉంటుంది. పైగా నాకు రెడ్డిగాడంటే చాలా అబ్బరంగా ఉండేది. ఎందుకంటే వాడితో అమ్మాయిలు మాట్లాడతారు. ఫైనలియర్ రోజుల్లోనైతే వాళ్ళూరిలో ఒక పదహారేళ్ళ అమ్మాయి వీడి కోసం రాత్రుళ్ళు పెరట్లోకొచ్చి ఎదురుచూసేది. వీడు గోడ దూకి అక్కడికి వెళ్ళేవాడు. ఇద్దరూ బావి మాటున కూర్చునేవారు. ఈ రాత్రి సాహసాలన్నీ వివరంగా వర్ణిస్తూ–ఆ రోజు కిటికీలో లైటు ఎక్కువసేపు వెలిగిందనీ, బావి దగ్గర దోమలు తెగ కుట్టాయనీ ఇలాగ–వాడు నాకు కథలాగా చెప్పేవాడు. నా కళ్ళముందు బొమ్మలు కదిలేవి. ఒకసారి వీళ్ళ రహస్యం బయటపడిపోయి, ఆ అమ్మాయిని గదిలోపెట్టి చితగ్గొడుతున్నప్పుడు- ఆ కొన్ని రోజులూ వీడు పడ్డ యాతనలో కొంత నేనూ పడ్డాను. తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళిచేసి పంపేసారు. వీడి ఫ్యామిలీ మాచవరం వచ్చేసింది. వీడు ఏడవగా చూసింది అప్పుడే. ఆ అమ్మాయి భర్తతో కలిసి తీయించుకున్న ఫొటోని ఫొటో స్టూడియో నుంచి సంపాయించి మాకు చూపించాడు. అమాయకత్వం ఆరని చెంపలతో ఆమె, పక్కన ముదురుమీసంతో భర్త. “కుతుకులూరు రెడ్లు అంతేరా,” అన్నాడు. ఈ ఎపిసోడ్‌తో నాకు వీడంటే ఎంతో ఆకర్షణ పెరిగిపోయింది. వీడి దగ్గర చాలా నేర్చుకోవచ్చనిపించేది. అమ్మాయిల విషయం ఒక్కటే కాదు; ఎవరితోనైనా సరే కలగజేసుకొని మాట్లాడే చొరవ, నేను వెనక్కి జంకే పరిస్థితుల్లో వీడు దూసుకుపోయే తీరు, మాట్లాట్డానికి ఏం లేని చోట కూడా నవ్వించేలా మాట్లాట్టం… ఇవ్వన్నీ వాడితో మసులుకుంటే నాకూ అబ్బుతాయేమో అనిపించేది, స్నేహం చేసి వాడిలోని సారమంతా లాగేసుకోవాలనిపించేది. అందుకే వాడు ఉన్నట్టుండి మాట్లాట్టం మానేసేసరికి- ఒక నాల్రోజులు చూసి, పెద్ద ఉత్తరం రాసిపడేశాను. మాట్లాడమనీ కాదు, మాట్లాడక్కర్లేదనీ కాదు. అదొక ప్రదర్శన, అంతే. మరుసటిరోజు సాయంత్రం నన్ను వాళ్ళింటికి తీసికెళ్ళాడు. పెంకుటింటి బైట గచ్చు మీద కూర్చున్నాం. వాళ్ళమ్మగారు ఇద్దరికీ కాఫీలు తెచ్చిచ్చారు. రెడ్డిగాడిది వాళ్ళమ్మగారి పోలికే. ఆవిడది ఎంతో కళగా, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ముఖం. నా ఉత్తరాన్ని రెడ్డిగాడు చాలాసార్లు చదువుకున్నాడని తెలిసింది. “నీలాగ నే రాయలేనురా” అన్నాడు. ఆ ఉత్తరంలో బహుశా ఎక్కడో నేను మామూలోడ్ని కాదనీ, నీ వెనకాల ఎటంటే అటు తిరిగే చెంచాగాడ్ని కాదనీ నిరూపించుకోవాలన్న ఉబలాటం ఉందేమో. అది తీరింది, కాస్త ఎక్కువే తీరింది. ఆ తర్వాత వాడు నన్ను సమానంగా చూడటమే కాదు, ఒక్కోసారి ఇలాంటి ఆలోచనలు మనసులో ఉంచుకుని, వాటిని అంతే స్పష్టంగా రాయగలవాడిగా నా మీద ఏ మూలో కుళ్ళుకునేవాడేమో అనిపించేది. అది అప్పుడప్పుడూ వాడి మాటల్లో బయటపడిపోయేది. 

బొర్రా గుహల్ని గబ్బిలాల కంపు మధ్య ఎన్ని మూలలకి పోయి చూడాలో అన్ని మూలలకీపోయి చూసేసాం. తర్వాత మా జీపువాడు ఆ చుట్టుపక్కలే ఏదో జలపాతం ఉందంటే అటు వెళ్ళాం. అందులో దిగి స్నానం చేసి, అక్కడ్నించి తుప్పల మధ్య ఒక బాటలో పైకి నడిస్తే మళ్ళీ రైల్వే ట్రాకు. పట్టాల మీద కొంత దూరం నడిచాం. చెప్పుల కింద కంకర్రాళ్ళు, తుప్పల్లోంచి పురుగుల చప్పుడు. ఒక టన్నెల్ ఎదురయ్యింది. రైలు వచ్చేలోగా టన్నెల్ ఈ చివర నుంచి ఆ చివరకి పరిగెత్తగలమా, ఒకవేళ ఈలోగానే రైలు వచ్చేస్తే టన్నెల్ వారన ఎటునక్కాలీ అని చూసుకున్నాం. ధైర్యం చేసి పరిగెత్తాం-టన్నెల్ చీకటి గుయ్యారంలోకి, దూరంగా అటుచివర్న కనిపిస్తున్న వెలుగు వైపుకి. లోపలంతా చల్లటి తేమ చీకట్లు. మా అరుపులూ పొలికేకలూ మళ్ళీ మాకే వేరేలా వినపడుతున్నాయి. రాని రైలు వచ్చేస్తున్నట్టు వీపు వెనక తరిమే భయం. నరాలు బిగిసే ఆనందం. పరిగెత్తి పరిగెత్తి… అటు చివర్నుంచి దూసుకొచ్చాం, తుపాకి గొట్టంలోంచి గుండ్లలాగ, మళ్ళీ పచ్చటి చెట్ల మధ్యకి.

వీళ్ళిద్దరూ అప్పుడప్పుడూ నన్ను కలవటానికి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. రెడ్డిగాడైతే ఒకసారి నేను ఊరెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు నన్ను రైలెక్కిద్దామని వచ్చి, అప్పటికప్పుడు అనుకుని నాతోపాటు రైలెక్కేశాడు. జనరల్ బోగీలోకి తోసుకుంటూ దూరేసాం. కిటికీల పక్కన ఎదురుబొదురుగా సీట్లు దొరికాయి. వాడు ఒక అమ్మాయికి పక్కన చోటులేకపోయినా జరిగి చోటిచ్చాడు. ఆ అమ్మాయి తెల్లగా పొట్టిగా ఉంది. చున్నీ లేదు, మాసిన జుట్టు, వొంట్లో పనులకెళ్ళే మోటుదనం. ఏదోలాగ వేలాడుతూ కునకటమే తప్ప నిద్రలేని ఆ ప్రయాణంలో వాడూ ఆ అమ్మాయీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నానా పాట్లూ పడ్డారు. పొద్దున్న లేచేసరికి ఇద్దరికీ ఏదో మొగుడూ పెళ్ళాల్లాంటి చనువొచ్చేసింది. వాడా అమ్మాయికి కిటికీలోంచి ఏవో కొనిపెట్టాడు. దిగేటప్పుడు ఆ అమ్మాయి సామాను మోసాడు. నేను తర్వాత వెక్కిరింపుగా నవ్వలేనంత మామూలుగా చేశాడిదంతా. అప్పటికింకా సెల్ఫోన్లవీ ఎక్కువ లేకపోబట్టిగానీ లేదంటే ఇద్దరూ నంబర్లు కూడా మార్చేకుందురు.

వచ్చేటప్పుడు వాడి పర్సులో ఏం డబ్బులున్నాయో అవే ఉన్నాయి. నేను ఆఫీస్ అసిస్టెంటుగా నా నాలుగువేల రూపాయల జీతంలోంచి మహాయితే ఓ ఐదొందలు ఖర్చుపెట్టగలను. మొత్తానికి వాటితోనే సిటీ చూద్దామని బయల్దేరాం. మార్నింగ్ షో సినిమాకి వెళ్దామనీ, మధ్యాహ్నం బిర్యానీ తిందామనీ, సాయంత్రానికి నెక్లెస్ రోడ్డుకి పోదామనీ… ఇలా చాలా ప్లాన్లు వేసుకున్నాం. అమీర్‌పేటలో నడుస్తుంటే పుట్‌పాత్ మీద ఒకడు తువ్వాలు వేసి దాని మీద మూడు పెద్ద కారమ్స్ స్ట్రయికర్ల లాంటివి అటూ యిటూ తిప్పుతున్నాడు. ఆ మూడింటిలో ఒక బిళ్ళకి కింద వేరే రంగు చుక్క ఉంది. అది కనపడకుండా మూడూ బోర్లించాడు. కంటికి అందనంత వేగంతో మూడింటినీ తారుమారు చేస్తున్నాడు. వేరే రంగు చుక్కున్న బిళ్ళ ఎక్కడకి మారిందని అనుకున్నామో దాని మీద డబ్బులు కాయాలి. అప్పుడు తిప్పి చూపిస్తాడు. చుట్టూ ఉన్న గుంపులో నిలబడి కాసేపు ఆట చూసాం. కొంతమంది వంద కాయింతాలు పెడుతున్నారు, గెలిచినవి జేబులో వేసుకుంటున్నారు. చూసేకొద్దీ ఆ చుక్కున్న బిళ్ళ ఎక్కడకి మారుతుందో మాకు సులువుగా తెలిసిపోతున్నట్టు అనిపించింది. రెడ్డిగాడు గుంపులోకి దూరి ఒక వంద పెట్టాడు. పోయింది. ఇంకో వందపెట్టాడు. మళ్ళీ పోయింది. పోయిన రెండు వందలూ ఒకే దెబ్బకి వెనక్కి వచ్చేలాగ ఇంకో రెండు వందలు పెట్టాడు. అవీ పోయాయి. అప్పుడింక నేను వెనక్కి లాగటం మొదలుపెట్టాను. వాడు మాత్రం ఉన్నవన్నీ తుడిచిపెట్టుకుపోయేదాకా వెనక్కి తగ్గలేదు. పాపం వాడలా అన్నీ పోగొట్టుకున్నప్పుడు నేను మాత్రం డబ్బులు దాచుకోవటం అన్యాయం కదా అనిపించి, ఆ ఒకేఒక్క కారణంతో, జేబులోంచి వంద కాయింతం తీసాను. మొత్తానికి ఇద్దరం ఓ వెయ్యి దాకా వదుల్చుకుని ఆ గుంపులోంచి బైట పడ్డాం. అప్పటిదాకా నగరం ఎన్నో అవకాశాలతో చేతులు చాపి, మా ముందు ఎంతో హొయలు పోయిందల్లా, మా జేబులు ఖాళీ అని తెలియగానే ముఖం మాడ్చుకుని తలుపేస్సుకుంది. ఆట చుట్టూ మూగినవాళ్ళల్లో కొంతమంది రహస్యంగా ఆడించేవాడి తరఫున పని చేస్తున్నారనీ, వాళ్ళు మమ్మల్ని ఊదరగొట్టి పదే పదే తప్పుడు బిళ్ళ మీద డబ్బు కాసేలా చేసారనీ… ఇలా అప్పటికింక ఎందుకూ పనికిరాని చర్చలన్నీ చేసుకుంటూ, సెకండ్ క్లాసు టికెట్టుతో సినిమా చూసి, దారిలో చెరుకు రసం మటుకు తాగి, ఈసురో దేవుడా అనుకుంటూ గదికి వచ్చి పడ్డాం. ఆ నాల్రోజులూ అన్నీ మూసుకుని గదిలోనే ఉన్నాం. మహాయితే ఒక రాత్రి సత్యసాయి నిగమాగమంలో ఎవరిదో అరువుపెళ్ళికి వెళ్ళి భోజనం చేసొచ్చుంటాం. వాడ్ని వెనక్కి పంపటానిక్కూడా నా రూమ్మేట్లని డబ్బులడగాల్సి వచ్చింది. వాడు కాకినాడ వెళ్ళాక కొన్నాళ్ళు వాళ్ళ మామయ్య దగ్గర చికెన్ షాపులో తోడున్నాడు. తర్వాత ఎల్.ఎల్.బిలో చేరాడు.

బాషాగాడు రెండుమూడు సార్లు చెప్పుల షాపుకి మెటీరియల్ కోసమని వచ్చాడు. అప్పటికి నాకు జీతం బానే ఉంది. ఇద్దరం అటూయిటూ తిరిగాం. రాత్రికి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో గోడ మీద కూర్చున్నాం. ఎదర ప్లాజాలో పెద్ద జనం లేరు. మా నీడలు మా ముందు పొడవుగా సాగాయి. సాగర్ అవతల టాంక్బండ్ మీద పసుపు ఎరుపు ముత్యాలు దొర్లుకుంటూ పోతున్నట్టు ట్రాఫిక్ లైట్లు. బాషాగాడంటేనే ఒక ఊగిసలాట. ఏదీ ధైర్యంగా అడుగేయడు. మా నలుగురిలో కృష్ణ, రెడ్డి వీళ్ళిద్దరే డిగ్రీ పాసయ్యారు. బాషాకి పదకొండు సబ్జెక్టులుపోతే, నాకు పదమూడు సబ్జెక్టులు పోయాయి. నేను సబ్జెక్టులు కట్టే పని పెట్టుకోకుండా వెంటనే హైదరాబాద్ వచ్చేసాను, ఉద్యోగం వెతుక్కోవటానికి. బాషా మాత్రం ప్రతి ఏడాదీ వెళ్ళి పరీక్షలు రాసొచ్చేవాడు. ఏడాదికి ఒకటో రెండో పాసయ్యేవాడు. చివరికి ఎన్ని పూర్తి చేశాడో, ఎప్పుడు ప్రయత్నించటం మానేశాడో తెలీదు. మంగళవారాలు మండపేటలో ముస్లింల వ్యాపారాలకి సెలవు. ఆ రోజున తోటి ముస్లిం కుర్రోళ్ళతో కలిసి కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాడు. బాషా వాళ్ళూ నలుగురన్నదమ్ములు. కానీ వాళ్ళింట్లో ఉన్నవి రెండే వ్యాపారాలు. ఒకటి వాళ్ళ నాన్నగారు చేసే కాంట్రాక్టులు, రెండోది చెప్పుల షాపు. పెద్దన్నయ్య రైల్వేలో జాబు కొట్టేడు. రెండో అన్నయ్య వాళ్ళ నాన్నగారి తర్వాత కాంట్రాక్టులు చేస్తున్నాడు. ఇక మిగిలిన చెప్పుల షాపు కోసం మూడో అన్నయ్యకీ, బాషాగాడికీ మధ్యన పైకి చెప్పలేని పోటీ ఏదో నడుస్తుందనిపించేది. కొన్నాళ్ళు పక్కవీధిలో బాషాగాడి కోసమనే ఇంకో చెప్పుల షాపు తెరిచారు, కానీ నడవక మూసేశారు.

“గ్రౌండ్లో మీ వోళ్ళతో క్రికెట్ ఇంకా ఆడుతున్నావారా?”

“లేదురా… ఆ సర్కిలంతా వేరైపోయింది. ఆడుతున్నారు కానీ కుర్నాకొడుకులు… మనం కలవలేం.”

“ఏదోలా ధైర్యం చేసి వచ్చేయెహె. ఇక్కడే ఏదోటి చేసుకోవచ్చు.”

“చూడాల్రా. కానీ ఇది కాంట్రాక్టు పనులకి సీజను. మా అన్నయ్య ఒక్కడూ చెయ్యలేడు.”

“మరి సీజన్ లేనప్పటి సంగతి? అదెలాగూ మీ అన్నయ్యదే కదా, అప్పుడేం చేస్తావ్?”

“చెప్పుల షాపుంది కదా.”

“ఒరే కాంట్రాక్టుల సీజన్ అని అటు వెళ్తావ్, చెప్పుల సీజన్ అని ఇటు వస్తావ్. తీరా చూస్తే అవి రెండూ నీవి కాదు. చూస్కోపోతే… చివరికి ఎటూ కాకుండా పోతావ్”

ఒక్కొకళ్ళ జీవితం ఒక్కో స్పీడులో వెళ్తుందేమో. ఇక్కడ నా జీవితంలో ఎన్నో జరిగిపోతుండేవి. అక్కడ రెడ్డిగాడు మాత్రం ఎప్పుడూ ఆ మాయదారి ఎల్.ఎల్.బి చదువుతూనే ఉండేవాడు. తర్వాత కొన్నాళ్ళు ఎంబీయే అన్నాడు. చివరకు ఫోన్లో వాడు ఇవన్నీ చెబుతుంటే- బెంచీల మీద అందరూ మీసాలు సరిగారాని అబ్బాయిలే ఉన్న క్లాసులో వీడొక్కడూ ముదురు మనిషి కూర్చొని పాఠాలు వింటున్నట్టు ఊహ వచ్చేది. ఎప్పటికో ఈ కాలేజీలు వదల్లేక వదల్లేక వదిలి, ఎవరో లాయరు దగ్గర అసిస్టెంటుగా చేరాడు. ఒకసారి ఏదో పని మీద కాకినాడ వెళ్ళినపుడు వాడిని అక్కడ కోర్టులో కలిసాను. అక్కడ జిల్లా కోర్టులన్నీ ఒకే ప్రాంగణంలో ఉంటాయి. ఎటు చూసినా- భూమిని పట్టుకుని ఆకాశంవైపుకి వేలాడే గబ్బిలాల్లాగ నల్లకోట్లలో మనుషులు. రెడ్డిగాడు కూడా తెల్ల షర్టూ ఫాంటు మీద నల్ల కోటు వేసుకుని బార్ లోంచి మెట్లు దిగి బయటకొచ్చాడు. నాకు ఆ రోజు కోర్టు హాళ్ళన్నీ తిప్పి చూపించాడు. సినిమాల్లో చూసే కోర్టు సీన్సుని ఆ గదుల్లో ఊహించుకున్నాను. కానీ ఆ చెక్కబోనూ, పైన జడ్జిగారు కూర్చునే అరుగూ తప్పించి చూస్తే అవి స్కూళ్ళల్లో స్టాఫ్ రూముల్లాగ చాలా మామూలుగా ఉన్నాయి. ఇక్కడి నుంచే చట్టం అనే వలనోదాన్ని విశాలంగా జనం మీదకి విసిరిపారేసి దొరికినోళ్ళని దొరికినట్టు జైళ్ళలోకి తోసేస్తారన్నమాట, అనిపించింది. ఆ అరిగిపోయి మాసిపోయిన వరండాల్లో నడుస్తున్నప్పుడు అక్కడక్కడా నల్ల కోట్లు వేసుకుని ఆడవాళ్ళూ కనిపిస్తున్నారు. ఒకరిద్దరిని చూపించి “వీళ్ళ మొహాలు గుర్తుపెట్టుకో, తర్వాత చెబుతాను ఒక్కోద్దాని గురించీ” అన్నాడు రెడ్డి. “పక్కా బోకులురా బాబూ ఒక్కోత్తీ” అన్నాడు ఆ సాయంత్రం వాడి గదిలో కూర్చున్నప్పుడు.

ఆడాళ్ళు కుళాయిల దగ్గర నీళ్ళ కోసం కొట్టుకునేలాంటి, మున్సిపాలిటీవాళ్ళు ఓపెన్ డ్రైనేజీల రొచ్చు తీసి రోడ్ల వారనే ఎండబెట్టేసేలాంటి ఒక ఇరుకు వీధిలో ఉంది వాడు అద్దెకుంటున్న గది. పెచ్చులూడిపోయిన మెట్లెక్కాం. దిగేవాళ్ళు ఎదురొస్తే ఎక్కేవాళ్ళు గోడకి అంటుకుపోవాలి. వాడి గదిలో ఎక్కడ్నుంచొస్తుందో తెలీకుండా నామమాత్రంగా వెలుగు. ఎండ తగలని గోడల్లోంచి తేమ వాసన. రెడ్డిగాడికి వాడు పని చేసే పెద్ద లాయరు ఇచ్చే జీతం ఎందుకూ పనికిరాదు. ఏదో ఫైళ్ళు రాసిపెట్టి, వాటిని మోసిపెట్టటం లాంటి చిన్న ఉద్యోగం. గడవటానికి దాంతోపాటు ఇంకేదన్నా చేస్తూ సంపాయించుకోవాల్సిందే.

“ఇంతేరా ఈ ఫీల్డు. సక్సెస్ అయ్యేదాకా నానా చంకలూ నాకాలి. ఒక్కసారి సక్సెస్ అయితే మాత్రం ఎక్కడో ఉంటాం. అంతా మాటల మీదే నడిచిపోద్ది… మాటలు… “

“నీకేరా, నువ్వు బానే మాట్లాడతావు కదా”

“నా మాటల్దేవుంది లేరా! మా సార్ మాట్లాట్టం చూడాలి నువ్వు… ఓర్నాయనో…  మనిషినలా నిలబెట్టి చుట్టూ కోటలు కట్టేస్తాడు. ఛా… మనం టైం వేస్ట్ చేస్సేంరా చాలాని. ఇయ్యన్నీ ఇప్పుడు చేయాల్సినవి కావు. ఓ పక్క ఇంట్లో మా బాబేమో పెళ్ళీపెళ్ళని దొబ్బేత్తన్నాడు.”

“ఎలా ఉన్నార్రా ఆయన?”

“ఉన్నాడులే. మాచవరం దగ్గర ఇటికెల బట్టీ ఒకటి దొరికితే చూసుకుంటున్నాడు. ఈ వయసులో ఒక్కడే ఆ వేడిలోని బూడిదలోని… నన్నడిగితే ప్రతి ఒక్కళ్ళూ కనీసం ఇద్దరు ముగ్గురు కొడుకుల్ని కనాల్రా మాయ్యా. ఒక్కడ్నే కని, ఆ ఒక్కడి మీదే ఆశలన్నీ పెట్టేసుకుని, వాడేమో ఎంతకీ అందిరాక, వయసైపోయినా ఏ రెస్టూ లేకుండా పని చేయాల్సి రావటం, ఇంక మనవలే జీవితానికి మిగిలిందన్నట్టు కొడుకుని పెళ్ళీ పెళ్ళని దొబ్బటం…”

“చేసేసుకోరా పోనీ… మరీ లేటైపోకుండా…”

“ఒరే ఈ గదివాటం చూసే ఆ మాట అంటున్నావా నువ్వు?”

“పోనీ నీతోపాటు సంపాయించే అమ్మాయినే చూసుకో… ఇక్కడెవరూ తగల్లేదా అలాగ…”

“ఛీ… వీళ్ళ జోలికి పోకూడదురా నాయనా. ఈ ఫీల్డులో ఎవర్నైనా అంటుకుంటే మసే,” ఏదో వ్యాధి గురించి మాట్లాడుతున్నట్టు పెట్టాడు ముఖం.

“మరీ చెప్తావ్రా… ఒక్క మంచమ్మాయీ ఉండదా?”

“అమ్మాయిలా…? అమ్మాయిలెవరూ లేరిక్కడ. నా ఫోన్ చూపిస్తే జడుసుకుంటావు.”

ఈ ఊరినిండా అక్రమ సంబంధాలే అన్నట్టూ, ఏ వీధిలో చూసినా రంకేనన్నట్టూ మాట్లాడాడు. వాడి మాటలు విన్నకొద్దీ ప్రపంచంలో వాడికి ఆడాళ్ళుగా మిగిలింది తల్లులూ చెల్లెళ్ళేనేమో అనిపించింది. మేడ మీద లుంగీ బనీన్లో నుంచుని నాకు చెయ్యూపాడు, నా పాత హీరో.

ఓ నాలుగేళ్ళ క్రితం హైదరాబాద్‌లో కలిశాం. అప్పటికి వాడు ‘లా‘ కూడా వదిలేసి హైదరాబాదులోనే ఏదో ఉద్యోగం వెతుక్కుందామని వచ్చాడు–ముప్ఫయ్యేళ్ళు దాటాక, చాలా ఆలస్యంగా. నేను అప్పుడేవో నా సమస్యల్లో ఉండి వాడ్ని పెద్దగా కలవటం కుదరలేదు. ఒకసారి మాత్రం వీర్రాజు అని ఒక పాత కాలేజీ ఫ్రెండ్ మా ఇద్దరినీ వాళ్ళ ఇంటికి పిలిచాడు. ఈ వీర్రాజుని నేను డిగ్రీ తర్వాత ఎప్పుడూ కలవ లేదు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాడని రెడ్డిగాడు చెప్తేనే తెలిసింది. ఒకసారి ఫోన్లో మాట్లాడుకున్నాం. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళావిడా పిల్లలూ ఊరెళితే ఓ సిట్టింగేద్దాం రమ్మంటున్నాడు. కెపీహెచ్బీలో అప్పర్ మిడిల్ క్లాసు వీధిలో ఇల్లు. లిఫ్ట్ లోంచి బైటికి వస్తే–ఫ్రంట్ బాల్కనీలో పాకిన లతలు, గోడకి ఆనించి షూ స్టాండు. తలుపు తాళమేసి ఉంది. వీర్రాజుకి ఫోన్ చేస్తే ఇద్దరూ వైన్ షాప్ దగ్గర ఉన్నారట. “నీకేం తెమ్మంటావు?” అని అడిగాడు. నేను తాగుడు మొదలెట్టిందే చాలా ఆలస్యంగా. కాబట్టి బ్రీజరూ, బీరూ ఇలా ఒక్కో మెట్టూ ఎక్కేంత టైం లేక తిన్నగా హార్డే తాగటం మొదలుపెట్టాను. అందులోనే ఏదన్నా తెమ్మని చెబితే, “ఛీ, ఎండాకాలం హార్డెందుకురా. మేమిద్దరం బీరు తెచ్చుకుంటున్నాం, ట్యూబోర్గు లైటు, పోనీ నీకొక్కడికీ స్ట్రాంగ్ తెస్తాంలే,” అన్నాడు. 

ముగ్గురం హాల్లో కూర్చునేసరికి కరెంటుపోయింది. ఛార్జింగ్ లైటు వెలుగులో అన్నీ సర్దుకున్నాం. మాకు ఏసీలో తాగే యోగం లేదన్నాడు వీర్రాజు. ఫ్రిజ్ లోంచి ద్రాక్షపళ్లు తీసి కడిగి పళ్ళెంలో తెచ్చి పెట్టాడు.

“ఇదేం గొడవరా… కారం కారంగా ఏదన్నా తేవొచ్చుగా?” అన్నాను.

“ఎందుకురా అయ్యన్నీ కడుపు చెడగొట్టుకోవటానికి కాకపోతే. ఇవి తిను, హెల్తీ. కావాలంటే మా అత్తగారు జంతికలూ కాజాలు పంపారు, అవి తీయనా పై నించి? స్వీట్స్ తింటే ఇంకా బా ఎక్కుతుందంట కూడా…”

రెడ్డిగాడు నా మొహం చూసి నవ్వుతున్నాడు. వాడికి ఈ వీర్రాజుగాడు ఇంటర్ నించీ తెలుసు. నాకు మాత్రం డిగ్రీలో కలిసాడు. కామర్స్ గ్రూపు. ఎప్పుడూ పక్కన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్సుని వెంటేసుకుని, వాళ్ళ ఖర్చులన్నీ వీడు పెట్టుకుంటూ, ఆ ఒక్క అర్హత మీదా వాళ్ళకి లీడరులాగా మసులుకునేవాడు. రెండు మూడుసార్లు మా ముగ్గురినీ కూడా సినిమాలకి తీసుకెళ్ళాడు.

తొక్కలో బీరే కదా అన్నట్టు మొదటి సీసా గడగడా తాగేశాను. కానీ స్ట్రాంగ్ బీరుని తక్కువ అంచనా వేసానని త్వరగానే అర్థమైంది. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వీర్రాజుగాడు ఇక్కడ ఏం చేస్తున్నాడో, ఆ ఉద్యోగమెలా వచ్చిందో చెబుతున్నాడు. నా నోటికి ఫిల్టరింగ్ పోయింది: “మీ కమ్మోళ్ళకేంలేరా, ఎప్పుడూ ఒకళ్ళెనకాల ఒకళ్ళుండి బానే పుషింగ్ ఇచ్చుకుంటారు.”

“ఏం మీ కాపోళ్ళిచ్చుకోరా, రెడ్లిచ్చుకోరా… ఎదవ వాగుడూ నువ్వూను.”

“మీకున్నంత పెద్ద నెట్వర్క్ ఉండదులే. ఇంటిపేరు ఆనవాలు కడితే చాలు… మీ జల్లెడ బొక్కల్లోంచి ఎవ్వడూ కిందకి జారడు….”

రెడ్డిగాడు మధ్యలో కలగజేసుకొని నన్ను వెనక్కి లాగటానికి ట్రై చేస్తున్నాడు. “మనోడికా ఫీలింగ్ లేదెహె…” అంటున్నాడు.

నాకు పూర్తిగా తలకెక్కేసింది. ఇంక పెట్రేగిపోయాను. వీర్రాజుగాడ్ని నేరుగా అవమానించటం మొదలుపెట్టాను. ఏమాత్రం సరుకు లేకపోయినా ఇంటిపేరుని బట్టే వాడిక్కడ మంచి ఉద్యోగం సంపాయించి సెటిలయ్యాడన్నాను. కాలేజీలో ఉండగా బాలకృష్ణ సినిమా రిలీజైనప్పుడల్లా వాడు చేసిన హడావిడిని వెక్కిరించాను. పేర్లో లేకపోయినా వాడి ఫేస్బుక్ ప్రొఫైల్‌లో వచ్చి చేరిన “చౌదరి” అన్న తోకని వెక్కిరించాను. రెడ్డిగాడు ఎన్నిసార్లు మాట మళ్ళించినా ఫలితం లేకపోయింది. ఆ రోజుకి నాది ఒకటే పాటై పోయింది. బాల్కనీలో సిగరెట్లు కాల్చుకోవటానికి లేచినా ఈ టాపిక్ వదల్లేదు. “ఆ కమ్మ బలుపు చూపించుకోవటానికి అలా డబ్బులు ఖర్చుపెట్టేవోడివి కాబట్టి కానీ లేదంటే నీ వాటానికి కాలేజీలో నీకంతమంది ఫ్రెండ్సే ఉండేవాళ్ళు కాదు” అన్నాను. వీర్రాజు సిగరెట్ పారేసి రెడ్డితో “రేయ్… వాడ్నా టాపిక్ వదిలేయమనరా ఇంక” అని చెప్పి లోపలికి వెళ్ళిపోతున్నాడు. అసలు మా మధ్య లేనే లేని చనువుతోటి వాడి భుజం మీద చెయ్యేసి వెనక్కి లాగబోయాను. వాడు చప్పున వెనక్కి తిరిగి ఒక్క తోపు తోసాడు. నేను వెళ్ళి పూలకుండీల మధ్యన పడ్డాను. లేవటానికి ప్రయత్నించి మళ్ళీ మళ్ళీ పడిపోతున్నాను. ఏదో ఎండిన కొమ్మ బుగ్గ మీద విరిగింది. రెడ్డిగాడు వచ్చి చేయిచ్చాడు. నాకెంత ఎక్కేసిందంటే, అప్పుడు కూడా కోపం రాలేదు, ఏదో వాగుతూనే ఉన్నాను, బీరు మీద బీరు తాగుతూనే ఉన్నాను, అవుటైపోయేదాకా.

మరుసటిరోజు ఇంట్లో అద్దం ముందు నిల్చొని, నా బుగ్గ మీద తెల్లటి లోపలి పొర కనిపించేలా లేచిన చర్మాన్ని చూసాకా, అది పిండితే మొలుచుకొచ్చిన రక్తాన్ని చూసాకా అప్పుడు వచ్చింది కోపం. కానీ వీర్రాజుగాడి మీద కోపం కన్నా, రెడ్డిగాడు అక్కడ ఉండి నా వాగుడంతా విన్నాడన్న సిగ్గే ఎక్కువైపోయింది. నేనేదో కాస్త తెలివైనవాడ్నని ఊహించుకునే రెడ్డిగాడి ముందు ఏ మాత్రం లౌక్యం లేని కులగజ్జి వెధవలాగా దొరికిపోవటం అవమానంగా అనిపించింది. అది దెబ్బలాకన్నా అవమానంలానే ఎక్కువ రోజులు నొప్పెట్టింది. ఆ దెబ్బ ఎలా తగిలిందని మా ఆవిడ ఎంత అడిగినా చెప్పలేదు. అది మానేదాకా కొన్నాళ్ళు గడ్డం పెంచాను. గొడవైన తర్వాత రెండ్రోజులకే వీర్రాజుగాడు మా ఇంటికి వచ్చాడు. మొన్న నా చేత అడిగి తెప్పించుకున్న పుస్తకాలు తీసుకొచ్చాడు. వాడు అడిగినవన్నీ సొల్లు పుస్తకాలే, ఇచ్చినా ఇవ్వకపోయినా లెక్కేం లేదు. బహుశా నా ప్రవర్తనకి పశ్చాత్తాపం ఏమన్నా కనపడుతుందేమో చూద్దామని కూడా వచ్చినట్టున్నాడు. నాకు కోపం అణచుకోటానికే సరిపోయింది, ఇంక పశ్చాత్తాపమెక్కడ. మా ఆవిడ టీ పెట్టబోతుంటే అవసరంలేదని చెప్పాను. వాడిని తర్వాతెప్పుడూ కలవ లేదు.

అప్పులనేవి చీడలాంటివి. అప్పులున్నవాడి మనసులోని ఈన్యం భరించలేనిది. మా పిల్లాడు నెలలు నిండకుండానే పుట్టాడు. బొడ్డుపేగు మడతపడి తల్లి తిన్నదేదీ వాడికి పూర్తిగా వెళ్ళలేదు. పైగా పుట్టగానే పచ్చకామెర్లు. హైదరాబాద్‌లో అన్నేళ్ళ ఉద్యోగాల్లో నేను దాచుకున్నదేదీ లేదు–నాచేతికి కుష్టులాగా దుబారా. దాంతో పిల్లాడు ఆ ఖరీదైన ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్న ఆ ఒక్క నెలలోనే ఎడాపెడా అప్పులయిపోయాయి. ఆ తర్వాత కూడా అవి తీరటం కన్నా వాటికి వచ్చి చేరేవే ఎక్కువైపోయాయి. చివరికి చుట్టుపక్కల అప్పుడు టచ్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ అయిపోయి, అడిగినవాళ్ళనే మళ్ళీ అడగలేక, టచ్‌లో లేనివాళ్ళని కూడా కెలకటం మొదలుపెట్టాను. అలాగే ఏదో ఒక నెల అత్యవసరమైతే బాషాగాడికి ఫోన్ చేసి పది వేలడిగి అకౌంట్లో వేయించుకున్నాను. వాడు ఈ ఐదేళ్ళలోనీ ఎప్పుడూ ఆ డబ్బు ప్రస్తావన తేలేదు. కానీ డబ్బులు ఇచ్చినవాళ్ళెవ్వరూ ఇచ్చింది మర్చిపోరని నా స్వభావం ప్రమాణంగా నాకు తెలుసు. నేను ఫోన్ చేసినప్పుడల్లా–ఫోన్ చేసి వేరే కుశలం అంతా మాట్లాడినప్పుడల్లా–ఇచ్చిన డబ్బులు వాడికి ఏదో మూల గుర్తొస్తూనే ఉంటాయని తెలుసు. కానీ తీర్చవలసిన జాబితాలో వాడి నంబర్ ఇప్పుడప్పుడే లేదు. అందుకని ఫోన్ చేయటమే మానేశాను. చివరికి వాడి పెళ్ళికి పిలిచినా వెళ్ళలేదు. రెడ్డి, కృష్ణ వెళ్ళొచ్చారట.

రెడ్డిగాడి పెళ్ళి అంతకన్నా ముందే అయ్యింది. కానీ వాడు పెళ్ళికి పిలవటం మాట అటుంచి- అసలు పెళ్ళయిందనే చాలా రోజుల దాకా నాకూ బాషాకీ చెప్పలేదు. పెళ్ళయిన తర్వాత వాళ్ళ అత్తారోళ్ళ ఫైనాన్స్ వ్యాపారం చూసుకోవటం మొదలుపెట్టాడు. వాడంటే గొప్ప అన్న ఫీలింగ్ నాలో ఉండేదని వాడికీ తెలుసు. అందుకే ఇలా జీవితంలో సెటిలవ్వటం కోసమే చేసుకున్న పెళ్ళి గురించి నాకు చెప్పాలనుకోలేదేమో. పెళ్ళి ఫొటో కూడా ఎప్పుడూ చూపించలేదు. వాడంతట వాడు ఫోన్ చేయటమూ తక్కువే. నేనే ఎపుడన్నా ఊరికే ఫోన్లో పేర్లు చూసుకునే సమయాల్లో వాడి పేరు కనిపిస్తే చేసేవాడ్ని. ఆ మాటా ఈ మాటా మాట్లాడి “ఐతే కలుద్దాంరా” అని ఫోన్ పెట్టేస్తాం, కానీ కలవం.

పార్కులో పరుగయ్యాకా కాసేపు చెమటలు ఆరేదాకా తోవ వారనున్న బెంచీల మీద కూర్చుంటాను. తోవకి అటువైపున్న పొగడ చెట్ల మీద పడే ఎండనో, స్ప్రింక్లర్స్ చిమ్మే నీళ్ళు పచ్చికలో కట్టే కాలవల్లో దాహం తీర్చుకునే పక్షులనో చూస్తూ కూర్చోవటం, ఆలోచనల్ని ఎటు వెళ్తే అటు వెళ్ళనివ్వటం… చీకటిశూన్యంలో లతలాగ పాకుతుంది ఆలోచన, దానికి గతమూ భవిష్యత్తూ ఒకే రంగులో పూస్తాయి. ఆ రోజు ఇద్దరికీ ఫోన్ చేయాలనిపించింది. ముందు బాషాగాడికి చేసాను. ఇలా ఇప్పుడే మన వైజాగ్-అరకు ట్రిప్పు గుర్తొచ్చిందిరా అని చెప్పి, “ఇప్పుడు నువ్వెలాగూ కుంటెదవ్వి కాబట్టి పరుగుపందెం గెలవలేవు కదా” అన్నాను. “నీ యబ్బా” అని నవ్వుతున్నాడు. ప్రస్తుతం కాంట్రాక్టు పనే చేస్తున్నాడు. ఆ పని వాళ్ళ నాన్నగారి టైమ్‌లో ఉన్నంత సులువుగా లేదట. నా ఉద్యోగం ఎలా ఉందని అడిగాడు. పిల్లల స్కూలు ఫీజుల గురించి విసుక్కున్నాం. ఏపీలో ఎన్నికల మీద హైదరాబాద్‌లో టాకెలా ఉందని అడిగాడు. హైదరాబాద్‌లో ఉంటున్న మర్యాద ఇచ్చి అడిగాడు కదాని తెలీకపోయినా ఏదో చెప్పాను. ఈసారి మళ్ళీ ఎక్కడకన్నా ట్రిప్ వేసుకుందామన్నాడు. తర్వాత రెడ్డిగాడికీ ఫోన్ చేశాను. కాలర్ ట్యూన్లో “నీ కోసమే ఈ అన్వేషణా…” లాంటిదేదో పాత విషాద ప్రేమ గీతం. మళ్ళీ ఎవర్నో పటాయించే పనిలో ఉన్నాడనుకున్నాను. ఫోన్ తీయలేదు. రెండ్రోజుల తర్వాత ఒక రాత్రి వాడే చేశాడు. రైల్లో ఒంగోలు నుంచి మాచవరం వస్తున్నాడు. వాడి ఇద్దరు పిల్లల కుశలం నేనడిగాను, నా పిల్లాడి కుశలం వాడు. మాచవరంలో ఇల్లు కడుతున్నాడట. ఇలా బాషాగాడు మళ్ళీ ఎక్కడకన్నా ట్రిప్ పెట్టుకుందామంటున్నాడురా అన్నాను. “ఏంటి బాషాగాడే?” అని ఆశ్చర్యపోయాడు. సరేనన్నాడు. పనుల్లో తెరిపి చూసుకుని, భార్యాపిల్లల్ని విడిపించుకుని వెళ్ళటం ఎప్పటికి కుదురుతుందో తెలీదు.
*
(రస్తాలో పబ్లిష్ అయ్యింది)